అతి భారీ వర్షాలతో సౌదీ అరేబియాలోని మక్కా నగరం నీట మునిగింది. ఈదురు గాలులు, వడగళ్ల వానలతో జనజీవనం పూర్తిగా స్తంభించింది. మక్కా, మదీనా, జెడ్డా నగరాలు భారీ వరదల కారణంగా తీవ్ర పరిణామాలను ఎదుర్కొంటున్నాయి. ఈ వరదలు కారణంగా రోడ్డుపై నిలిపిన కార్లు నీటిలో కొట్టుకుపోయాయి. మస్సీదు-ఎ-నబవి, అల్-ఉలా మరియు అల్-మదీనా వంటి పవిత్ర మసీదులు కూడా నీటితో నిండిపోయాయి.
ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు
సౌదీ ప్రెస్ ఏజెన్సీ (SPA) తెలిపిన వివరాల ప్రకారం.. ముంపు ప్రాంతాల్లో చిక్కుకున్న ప్రజలను రక్షించేందుకు ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది. వర్షాలు ఇంకా కొనసాగే సూచనలు ఉన్నాయి. దాంతో, సౌదీ అరేబియా వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
భారీ నష్టం జరిగిందా?
కుండపోత వర్షాలు, వరదల వల్ల జరిగిన ప్రాణ, ఆస్తి నష్టాలపై వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. 2009లో జెడ్డాలో ఇలాంటి విపత్తు సంభవించి 100 మందికి పైగా మరణించారు. అదే విధంగా 2024లో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి.








