ఒకప్పుడు తెలంగాణలో ఎకరం భూమి అమ్మితే ఆంధ్రప్రదేశ్‌లో పదేకరాల భూమిని కొనే పరిస్థితి ఉండేదని, అయితే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ పరిస్థితి పూర్తిగా మారిపోయిందని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఎద్దేవా చేశారు. ఇప్పుడు ఏపీలో ఎకరం అమ్మితే తెలంగాణలో కేవలం రెండెకరాల భూమి మాత్రమే వస్తుందని, సీఎం రేవంత్ రెడ్డికి పాలన చేతకాకనే తెలంగాణలో ఈ పరిస్థితి వచ్చిందని ఆయన మండిపడ్డారు. తెలంగాణలో మళ్లీ కేసీఆర్ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని హరీష్ రావు అన్నారు. ప్రజ్ఞాపూర్‌లో గజ్వేల్ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ పాలనపై హరీష్ రావు విమర్శలు
హరీష్ రావు మాట్లాడుతూ, “కాంగ్రెస్ 20 నెలల పాలనలో రాష్ట్రం అధోగతి పాలైంది. కాంగ్రెస్ పాలనలో ప్రజలు స్వీయ అనుభవం చెందారు. రేవంత్ రెడ్డి చేసిన మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి.” అని పిలుపునిచ్చారు.
“ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగులను కాంగ్రెస్ పార్టీ రెచ్చగొట్టింది.”
“కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ఒక్కరికి కూడా పెన్షన్ ఇవ్వలేదు కానీ, 2 లక్షల పెన్షన్లు తీసేశారు.”
“కాంగ్రెస్ పాలనలో ఎరువుల కోసం చెప్పులు క్యూలైన్లో పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది.”
“కేసీఆర్ హయాంలో నాట్లకు, నాట్లకు రైతుబంధు వచ్చేది. రేవంత్ రెడ్డి హయాంలో ఓట్లకు, ఓట్లకు మధ్య రైతు భరోసా వస్తుంది.”
“కాంగ్రెస్ వచ్చాక బోరు బావుల మోటార్ల మెకానిక్‌లు మాత్రమే బాగుపడ్డారు” అని ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రంగా విమర్శించారు.
భూముల విలువలు, గజ్వేల్ అభివృద్ధిపై వ్యాఖ్యలు
“ఒకప్పుడు తెలంగాణలో ఎకరం భూమి అమ్మితే ఏపీలో పదేకరాల భూమి వచ్చేది. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి, అక్కడ చంద్రబాబు వచ్చాక సీన్ రివర్స్ అయింది. ఏపీలో ఎకరం అమ్మితే తెలంగాణలో రెండెకరాల భూమి వస్తుంది. రేవంత్ రెడ్డికి పాలన చేతకాక తెలంగాణలో ఇలాంటి పరిస్థితి వచ్చింది. మళ్లీ కేసీఆర్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారు.” అని హరీష్ రావు పునరుద్ఘాటించారు.
గజ్వేల్‌లో కాంగ్రెస్ నేతలు వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. “గజ్వేల్‌లో అన్ని మండలాల్లో గులాబీ జెండా ఎగరాలి. అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ గజ్వేల్.” అని ఆయన అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను ఆషామాషీగా తీసుకోవద్దని నాయకులకు సూచించారు. సిద్దిపేట జిల్లాపై కాంగ్రెస్ పార్టీ పగపట్టిందని, నాయకులు గ్రూపుల జోలికి వెళ్లవద్దని, రిజర్వేషన్లు వచ్చినప్పుడు ఎవరు పోటీలో ఉంటారనేది చర్చించి నిర్ణయం తీసుకుందామని ఎమ్మెల్యే హరీష్ రావు పిలుపునిచ్చారు.








