రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ గురుకులాల్లో (Residential Schools) ఫుడ్ పాయిజన్ కేసులు (Food Poisoning Cases) విపరీతంగా పెరిగిపోతున్నాయి. రోజుకో ప్రాంతంలో ఫుడ్ పాయిజనింగ్ ఘటన వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఈసారి ఏకంగా 90 మంది విద్యార్థులు (90 Students) తీవ్ర అస్వస్థతకు గురై, ఆస్పత్రిలో చేరిన సంఘటన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది.
హైదరాబాద్‌లోని బాగ్‌లింగంపల్లిలోని (Baghlingampally) మైనార్టీ గురుకుల పాఠశాలలో (Minority Residential School) ఫుడ్ పాయిజన్ ఘటన తీవ్ర కలకలం రేపింది. కలుషిత ఆహారం తిని ఏకంగా 90 మంది విద్యార్థులు అస్వస్థతకు గురై కింగ్‌కోఠి ప్రభుత్వ ఆసుపత్రికి (King Kothi Government Hospital) తరలించాల్సి వచ్చింది. వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి వంటి లక్షణాలతో విద్యార్థులు బాధపడటంతో తల్లిదండ్రులు, స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఘటనపై మాజీ మంత్రి హరీష్‌రావు (Harish Rao) తీవ్రంగా స్పందించారు. సమాచారం అందుకున్న వెంటనే కింగ్‌కోఠి ఆసుపత్రికి చేరుకున్న ఆయన బాధిత విద్యార్థులను పరామర్శించి, వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన హరీష్‌రావు, “90 మంది పిల్లలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నా ప్రభుత్వం నుంచి ఒక్క మంత్రి కూడా రాకపోవడం దారుణం. విద్యార్థుల ఆరోగ్యంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా?” అని ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి (Chief Minister) రేవంత్‌రెడ్డి (Revanth Reddy)పై విమర్శలు గుప్పించిన హరీష్‌రావు, “విజన్ 2047 అంటారు కానీ ఇది పాయిజన్ 2047లా మారింది. ఫుట్‌బాల్ కార్యక్రమాల కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేసే సీఎం, విద్యార్థుల ఆరోగ్యాన్ని మాత్రం గాలికి వదిలేస్తున్నారు” అంటూ మండిపడ్డారు. ప్రభుత్వం మాటల్లోనే కాదు, పనుల్లోనూ బాధ్యత చూపాలని డిమాండ్ చేశారు.
ఇదిలా ఉండగా, వైద్యుల సమాచారం ప్రకారం శుక్రవారం రాత్రి విద్యార్థులు తీసుకున్న ఆహారం కలుషితం కావడమే ఫుడ్ పాయిజన్‌కు కారణమని నిర్ధారించారు. డీహైడ్రేషన్ కారణంగా కొంతమంది విద్యార్థులు అస్వస్థతకు గురైనప్పటికీ, ప్రస్తుతం అందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.








