కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మొదటి ఏడాదిలో రూ.1,27,208 కోట్ల అప్పు చేసిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్ర ఆరోపణలు చేశారు. తెలంగాణ అసెంబ్లీలో బిల్లులపై జరిగిన చర్చ సందర్భంగా హరీశ్ రావు ఈ వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో బిల్లులు చర్చకు ముందే ప్రవేశపెట్టడం అసెంబ్లీ రూల్ బుక్‌కు విరుద్ధమని హరీశ్ రావు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. అసెంబ్లీ రూల్స్ ప్రకారం వ్యవహరించాలని అధికార పార్టీకి సూచించారు. నిన్న జరిగిన BAC సమావేశంలో హరీశ్ రావు పాల్గొన్న విషయం తెలిసిందే. అప్పులపైన అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించిన ఆయన, ప్రజలకు భారం కలిగించే విధంగా ఆర్థిక పరిపాలన జరుగుతోందని దుయ్యబట్టారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం ఆస్తుల కల్పన చేసింది.. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అప్పులు చేసి కమీషన్ల కోసం పంచుకుతిన్నారని ఆరోపించారు. ప్రజలకు వాస్తవాలు తెలియజేయాల్సిన అవసరం ఉందని, అసలు తాము అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా భట్టి ఏదేదో మాట్లాడుతున్నారని విమర్శించారు.
కాగా, నేడు అసెంబ్లీ సమావేశాలకు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు నల్ల దుస్తులు ధరించి బేడీలతో హాజరయ్యారు. లగచర్లపై తప్పుడు కేసులు బనాయించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.