లండన్ (London)లో ఉన్న మాజీ మంత్రి, బీఆర్‌ఎస్(BRS) ఎమ్మెల్యే హరీశ్‌రావు (Harish Rao) పార్టీలో తాజా పరిణామాలపై స్పందించారు. కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) చేసిన సంచలన ఆరోపణల నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
లండన్‌లో హరీశ్‌రావు
తమ కూతురి అడ్మిషన్ కోసం లండన్ వెళ్లిన హరీశ్‌రావు, అక్కడి బీఆర్ఎస్ ఎన్‌ఆర్‌ఐల ‘మీట్ ది గ్రీట్’ (Meet The Great) కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, “బీఆర్‌ఎస్‌లో మాజీ సీఎం కేసీఆరే(KCR) సుప్రీం లీడర్ (Supreme Leader). కలిసి పనిచేయడం, ప్రజలకు సేవ చేయడమే కేసీఆర్ మాకు నేర్పించారు. ఎవరి విషయంలోనైనా తుది నిర్ణయం పార్టీదే” అని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు కవిత ఆరోపణల నేపథ్యంలో పార్టీ వైఖరిని తెలియజేసే ప్రయత్నంగా కనిపిస్తున్నాయి.
మీడియా ప్రశ్నలకు మౌనం
ఈ సందర్భంగా కవిత ఇష్యూపై మీడియా అడిగిన ప్రశ్నలకు హరీశ్‌రావు నేరుగా సమాధానం చెప్పలేదు. భారత్‌కు తిరిగి వచ్చిన తర్వాతే దీనిపై మాట్లాడతానని ఆయన తెలిపారు. రేపు భారత్‌కు రానున్న హరీశ్‌రావు, తర్వాత మీడియా సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. ఈ సమావేశంలో ఆయన ఏం మాట్లాడతారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అదే సమయంలో, ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా విమర్శలు గుప్పించారు.