తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా మాజీ మంత్రి హరీశ్ రావు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క బడ్జెట్‌లో నీతి పాఠాలు చెబుతున్నారని వ్యంగ్యంగా కామెంట్స్ చేశారు. గత ఏడాది బడ్జెట్‌తో పోల్చితే ఈసారి అంచనాలను తగ్గించారని, ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. హరీశ్ రావు కాంగ్రెస్ ఎన్నికల హామీలను ప్రస్తావిస్తూ, “ఎల్ఆర్ఎస్ అవసరం లేదని చెప్పిన పార్టీ ఇప్పుడు ప్రజలపై భారంగా మోపుతోంది. ప్రభుత్వ భూములను నిర్బంధం లేకుండా అమ్ముతున్నారు” అని ధ్వజమెత్తారు.
రైతులకు న్యాయం జరిగిందా?
రైతులకు రూ.31 వేల కోట్ల రుణమాఫీ హామీ ఇచ్చినా, బడ్జెట్‌లో కేవలం రూ.20 వేల కోట్లు మాత్రమే కేటాయించారని ఆయన విమర్శించారు. రైతు భరోసా పథకం పేరును మార్చినా నిధులు విడుదల కాలేదని, కౌలు రైతులకు ఇచ్చిన వాగ్దానాలు అమలుకావట్లేదని ఆరోపించారు. “చేతకాని వారెవరు? మాట తప్పినదెవరు?” అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో ప్రజల్లో తీవ్ర అసంతృప్తి పెరుగుతోందని హరీశ్ రావు అన్నారు.