అమెరికాలో చదువుతున్న విదేశీ విద్యార్థులకు వైట్‌హౌస్ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ ఆఫీస్ అద్బుతమైన నిర్ణయం తీసుకుంది. ఫెడరల్ నిబంధనల ద్వారా ఎఫ్-1 స్టూడెంట్ వీసా (F-1 student visa) హోల్డర్స్‌కు హెచ్-1B వీసా (H-1B visa) పొందడానికి మరింత సులభతరం చేస్తూ ఈ కొత్త మార్పులను ప్రకటించింది. ఈ మార్పులు జనవరి 2025 నుండి అమల్లోకి రానున్నాయి.
ఈ నూతన విధానంతో ఎఫ్-1 విద్యార్థి వీసా కలిగిన వారు హెచ్-1B వీసాలోకి మారేందుకు ఎలాంటి చట్టపరమైన అడ్డంకులు లేకుండా సులభంగా మారవచ్చని ప్రభుత్వం తెలిపింది. దీనితో అమెరికాలోని టెక్ కంపెనీల కోసం శక్తివంతమైన వృత్తి నిపుణులను తీసుకునేందుకు కంపెనీలకు అవకాశం ఏర్పడుతుంది.
ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులని తమ కంపెనీల్లో ఉద్యోగాలకు నియమించుకునే విధానాన్ని మరింత సులభం చేస్తుందని హోంల్యాండ్ సెక్యూరిటీ వెల్లడించింది.