రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పర్సనల్ అసిస్టెంట్ (PA) సతీష్‌పై నమోదైన లైంగిక వేధింపుల కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. న్యాయం చేయమని కోరిన బాధితురాలిపైనే కాకుండా, ఆమెకు అండగా నిలిచిన వారిపై కూడా పోలీసులు ‘ప్రతీకార’ చర్యలకు దిగడం ఇప్పుడు మన్యం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
అసలేం జరిగింది?
సాలూరు పట్టణానికి చెందిన ఓ ప్రభుత్వ మహిళా ఉద్యోగి తన భర్త చనిపోయిన తర్వాత కారుణ్య నియామకం కోసం ప్రయత్నించారు. ఆ సమయంలో మంత్రి పీఏ సతీష్ ఆమెకు ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి సుమారు 15 లక్షల రూపాయలు వసూలు చేయడమే కాకుండా, పలుమార్లు తనపై అత్యాచారానికి యత్నించారని ఆమె నవంబర్ 27న జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దీనిపై సాలూరు పట్టణ పోలీసులు నవంబర్ 28న సతీష్‌పై FIR (No. 145/2025) నమోదు చేశారు.
తెరపైకి మరో కౌంటర్ FIR
నిందితుడు సతీష్‌పై కేసు నమోదు కావడంతో వెంటనే రంగంలోకి దిగిన స్థానిక టీడీపీ నేతలు కౌంటర్ అటాక్ మొదలుపెట్టారు. ఈ వార్తను ప్రసారం చేసిన సాక్షి టీవీ, పేపర్ ప్రతినిధులపై సాలూరు పట్టణ టీడీపీ అధ్యక్షుడు తిరుపతి నాయుడు ఫిర్యాదు చేయడంతో పోలీసులు మెరుపు వేగంతో FIR (No. 146/2025) నమోదు చేశారనే విమర్శలున్నాయి. ఇందులో BNS 353(1)(b), 353(1)(c), 356(2) వంటి కఠిన సెక్షన్లను చేర్చారు.
బాధితురాలిపై థర్డ్ డిగ్రీ?
ఈ కేసులో మరింత విస్మయకరమైన విషయం ఏమిటంటే, మహిళపై అత్యాచారానికి యత్నించిన నిందితుడిని అరెస్ట్ చేయాల్సిన పోలీసులు.. ఫిర్యాదు చేసిన బాధితురాలిని, ఆమెకు సహకరించిన మున్సిపల్ ఉద్యోగి దేవీ ప్రసాద్‌ను పార్వతీపురం రూరల్ పోలీస్ స్టేషన్‌లో నిర్బంధించారు. వారి సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని, ఫోరెన్సిక్ రిపోర్టుల పేరుతో వారిని చిత్రహింసలకు గురిచేశారని బాధితురాలు ఆరోపిస్తున్నారు. మంత్రి కుమారుడు ఫృథ్వీ, పీఏ సతీష్ చేసిన వాట్సాప్ చాటింగ్‌లు కల్పితమని ఒప్పుకోవాలని పోలీసులు బలవంతం చేసినట్లు ఆమె ఆరోపిస్తున్నారు. 15 రోజుల జైలు శిక్ష తర్వాత బయటకు వచ్చిన బాధితురాలికి వేధింపులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని బాధితురాలి సన్నిహితులు వాపోతున్నారు.
పరామర్శిస్తే నోటీసులా?
ప్రస్తుతం పోలీసులు ఈ కేసులో మరో అడుగు ముందుకేసి, బాధితురాలిని ఓదార్చిన వారిని, ఆమెకు ఫోన్ చేసిన వారిని కూడా వేధిస్తున్నారు. బాధితురాలి పక్షాన నిలిచిన మహిళా సంఘాల నేతలను ఈ కేసులో ఇరికించేందుకు BNS 308(7), 61(2), 336(2), 340(2) వంటి అదనపు సెక్షన్లను FIR 146/2025 లో చేర్చినట్లుగా సమాచారం. ఇందుకు సంబంధించిన ఆధారాలు కూడా బయటకు వస్తున్నాయి. మంత్రి ప్రతిష్టను దెబ్బతీసేందుకు కుట్ర పన్నారనే సాకుతో మరింత మందిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది.
ప్రజాసంఘాల ఆగ్రహం
నిందితుడిని వదిలేసి, బాధితురాలిని వేధించడంపై పౌర సమాజం, మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. “బాధితురాలికి అండగా నిలవాల్సిన మహిళా మంత్రే ఇలా కక్ష సాధింపులకు పాల్పడటం దారుణం” అని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికార బలాన్ని ఉపయోగించి పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.









