దేశ సమృద్ధికి స్వదేశీ మంత్రం కీలకం. తెలిసో తెలియకో రోజూ విదేశీ వస్తువులు వాడుతున్నాం. వాటి నుంచి అంతా బయటపడాలని పిలుపునిచ్చారు ప్రధాని మోడీ. శరన్నవరాత్రులు కానుకగా నేటి నుంచి GST ఉత్సవ్ ప్రారంభం కాబోతోందని.. దీంతో దేశంలో కొత్త చరిత్ర మొదలవుతోందన్నారు. తదుపరి తరం GST సంస్కరణలు అమల్లోకి వస్తున్నాయని చెప్పారు. GST సంస్కరణలు ఆత్మనిర్భర్ భారత్‌కు మరింత ఊతమిస్తాయని.. సరికొత్త చరిత్ర సృష్టించేందుకు ఇది దోహదం చేస్తుందని చెప్పారు.
జీఎస్టీ సంస్కరణలు భారత వృద్ధిరేటుకు దోహదం
జీఎస్టీ సంస్కరణలతో కొత్త చరిత్ర మొదలవుతోందని అన్నారు ప్రధాని మోదీ. ఇవి అన్ని రంగాలకు ఎంతో ప్రయోజనకరంగా ఉండబోతున్నాయన్నారు. జీఎస్టీ తగ్గింపు వల్ల పేదలు, మధ్యతరగతికి ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఈ మార్పులు రాష్ట్రాల అభివృద్ధికి దోహదం చేస్తాయని వివరించారు. దీని వల్ల ఉత్పత్తిదారులకు, వినియోగదారులకు ప్రయోజనం కలుగుతుందని ప్రధాని అన్నారు. జీఎస్టీ సంస్కరణలు భారత వృద్ధిరేటుకు మరింత దోహదం చేస్తామన్నారు.పెట్టుబడుల ప్రవాహం పెరుగుతుందని.. ఆత్మనిర్భర్ భారత్‌కు మరింత ఊతమిస్తాయని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు.
స్వదేశీ మంత్రం పాటించాలని ప్రజలకు పిలుపు
మరోవైపు దేశ ప్రజలంతా స్వదేశీ మంత్రం పాటించాల్సిన అవసరం ఉందన్నారు ప్రధాని మోదీ. విదేశీ వస్తువుల వినియోగం తగ్గించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రతి పౌరుడు స్వదేశీ ప్రతిజ్ఞ తీసుకోవాలని కోరారు. జీఎస్టీ తగ్గింపుతో ప్రతి ఇంటా ఆనందం వెల్లివిరుస్తుందన్నారు. ఏడాది కాలంలో ఇన్‌కమ్ ట్యాక్స్ పరిమితి పెంపు, జీఎస్టీ తగ్గింపు మధ్య తరగతి ప్రజలకు డబుల్ బొనాంజా లాంటిదన్నారు. ఐటీ మినహాయింపు, జీఎస్టీ తగ్గింపుతో ప్రజలకు రూ.2.5 లక్షల కోట్లు ఆదా అవుతుందన్నారు.








