నూతన సంవత్సరం వేడుకలు జరుపుకునేందుకు గోవాలో వెళ్లిన తాడేపల్లిగూడెం (Tadepalligudem) యువకుడిపై దారుణంగా దాడి జరిగింది. డిసెంబర్ 29న తాడేపల్లిగూడెం చెందిన ఎనిమిది మంది యువకులు గోవా ట్రిప్ వెళ్లారు. ఆ రోజున రాత్రి భోజనం చేసేందుకు వారు ఒక రెస్టారెంట్‌కి వెళ్లారు. అప్పటికే రెస్టారెంట్ యజమాని కుమారుడు ఓ యువతి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ విషయంపై యువకులు ఆగ్రహం వ్యక్తం చేసి యజమాని కుమారుడిని ప్రశ్నించారు. దీనిపై రెస్టారెంట్ నిర్వాహకులు దురుసుగా ప్రవర్తించి, కర్రలతో తాడేపల్లిగూడెం యువకులపై దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన రవితేజ అనే యువకుడు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు.
న్యాయం కోసం పోరాటం..
ఈ ఘటనపై గోవా పోలీసులకు ఫిర్యాదు అందింది. వెంటనే పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, తాడేపల్లిగూడెంలో రవితేజ కుటుంబం తీవ్ర ఆందోళనకు దిగింది. వారు నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. గోవా ప్రభుత్వం కూడా రవితేజ కుటుంబానికి న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు.