ఆ క్రెడిట్ జ‌గ‌న్‌దే.. గూగుల్ లేఖ‌తో బ‌య‌ట‌ప‌డ్డ నిజం

ఆ క్రెడిట్ జ‌గ‌న్‌దే.. గూగుల్ లేఖ‌తో బ‌య‌ట‌ప‌డ్డ నిజం

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి డేటా సెంటర్ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. గూగుల్ డేటా సెంటర్ అంటూ రాష్ట్రవ్యాప్తంగా హడావిడి చేసిన టీడీపీ ప్రచారం, ఇప్పుడు గూగుల్ సంస్థ రాసిన లేఖతో బూటకమని తేలిపోయింది. గూగుల్ పేరుతో ప్రచారం చేసిన ప్రాజెక్ట్ వాస్తవానికి అదానీ డేటా సెంటర్ అని తాజాగా వెలుగులోకి వచ్చిన పత్రాలు స్పష్టం చేస్తున్నాయి.

భూమి నుంచి నిర్వహణ వరకు అన్నీ అదానీకే
గూగుల్ సంస్థ ఏపీ ప్రభుత్వానికి పంపిన లేఖలో కీలక అంశాలు వెల్లడయ్యాయి. విశాఖ‌లో శంకుస్థాప‌న చేసిన డేటా సెంటర్‌కు సంబంధించిన భూమి యాజమాన్య హక్కులు పూర్తిగా అదానీ గ్రూప్‌కే ఉంటాయని, అలాగే నిర్మాణం, నిర్వహణ, పెట్టుబడులు అన్నీ అదానీ సంస్థే చేపడుతుందని గూగుల్ స్పష్టంగా పేర్కొంది. ప్రోత్సాహకాల పేరిట వేల కోట్ల రూపాయల ప్రయోజనాలు కూడా అదానీకే దక్కనున్నట్లు సమాచారం.

ఇప్పటికే విశాఖ పరిసరాల్లో 480 ఎకరాల భూమి కేటాయించగా, అదనంగా మరో 170 ఎకరాలు కేటాయించాలంటూ తీర్మానం చేసినట్లు తెలుస్తోంది. అయితే భూముల అప్పగింత, యాజమాన్య హక్కులపై అదానీ పెట్టిన షరతులపై పూర్తిస్థాయిలో చర్చించి నిర్ణయం తీసుకోవాలని మంత్రివర్గం భావించినట్లు సమాచారం. దీంతో మొన్న‌టి వ‌ర‌కు గూగుల్ డేటా సెంట‌ర్ అని జ‌రిగిన ప్ర‌చారం అదానీదేన‌ని, అదీ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి తెచ్చిన కంపెనీ అని తేలిపోయింది.

జగన్ హయాంలోనే శంకుస్థాపన
ఈ డేటా సెంటర్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన శంకుస్థాపన గతంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలోనే జరిగింది. అప్పట్లో అదానీ డేటా సెంటర్ అనే విషయాన్ని కప్పిపుచ్చి, ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ అంటూ చంద్రబాబు నాయుడు, లోకేష్‌లు ప్రచారం చేశారని వైసీపీ ఆరోపిస్తోంది. ఢిల్లీ వెళ్లి ఎంవోయూల పేరుతో చేసిన హడావిడి, విశాఖలో శంకుస్థాపన పేరుతో చేసిన ప్రచారం అన్నీ ఇప్పుడు గూగుల్ లేఖతో అబద్ధమని తేలిపోయిందని వైసీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.

విశాఖకు గూగుల్‌ను తెచ్చింది చంద్రబాబు అంటూ రాష్ట్రవ్యాప్తంగా హోర్డింగ్‌లు, ప్రచార కార్యక్రమాలు నిర్వహించిన టీడీపీకి, గూగుల్ లేఖ పెద్ద షాక్‌గా మారిందని రాజకీయ వర్గాలు చర్చిస్తున్నాయి. అదానీ పేరు ఎత్తితే జగన్‌కు క్రెడిట్ వెళ్తుందనే ఉద్దేశంతో గూగుల్ పేరుతో ప్రచారం చేశారని వైసీపీ సెటర్లు విమర్శిస్తున్నారు. ఆశ్చర్యకరంగా, టీడీపీకి అనుకూలంగా భావించే పత్రికలో కూడా డేటా సెంటర్ నిర్మాణం, నిర్వహణ బాధ్యతలు అదానీ సంస్థే చూసుకుంటుందని కథనం ప్రచురితం కావడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

“నిజం ఎప్పటికైనా బయటపడుతుంది”
వైసీపీ శ్రేణులు మాట్లాడుతూ.. “నిజాన్ని ఎల్లకాలం దాచలేం.. అబద్ధం ఎన్నిరోజులూ సాగదు” అంటూ టీడీపీపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. గూగుల్ లేఖతో చంద్రబాబు, లోకేష్ చేసిన ప్రచారం బెడిసికొట్టిందని, డేటా సెంటర్‌కు బీజం వేసింది వైఎస్ జగన్ అన్న విషయం మరోసారి స్పష్టమైందని వైసీపీ నేతలు అంటున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment