పర్యావరణ పరిరక్షణ, తక్కువ ఖర్చుతో ప్రయాణం అనే నినాదంతో ఎలక్ట్రిక్ వాహనాలు మార్కెట్‌లోకి వచ్చాయి. అయితే, అవి క్రమంగా ప్రమాదకరంగా మారుతున్నాయి. లిథియం-అయాన్ బ్యాటరీలు పేలిపోవడం ఇప్పుడు ఓ ప్రధాన సమస్యగా మారింది. తాజాగా ఘజియాబాద్‌లోని సర్వోదయ నగర్‌లో జరిగిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఎలక్ట్రిక్ వెహికిల్ బ్యాటరీ ఛార్జింగ్‌లో ఉండగా పేలి మంటలు చెలరేగాయి. ప్రమాదానికి గురైన బాబీ, అతని భార్య బేబీ, కుమారుడు వివేక్, కుమార్తె బినా తీవ్రంగా గాయపడ్డారు. కాలిన గాయాలతో ఆసుపత్రిలో చేరారు.
చికిత్స పొందుతున్న బాధితులు..
గాయపడిన కుటుంబాన్ని స్థానికులు వెంటనే జిల్లా ఎంఎంజి ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ముఖ్యంగా వారి చేతులు, కాళ్లు, ముఖం కాలిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఈ తరహా ప్రమాదాలు తక్కువైతేనే భద్రతా ప్రమాణాలపై ప్రజల్లో నమ్మకం పెరుగుతుంది. ఇకపై ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీల భద్రతపై మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.







