టీమిండియా (Team India) హెడ్‌కోచ్ (Head Coach) గౌతమ్ గంభీర్ (Gautam Gambhir)కు చాలా కాలం తర్వాత గొప్ప ఊరట లభించింది. ఇంగ్లాండ్ (IND vs ENG)తో జరిగిన రెండో టెస్టులో భారత్ చారిత్రాత్మక విజయం సాధించడంతో, ఇటీవల కాలంలో అతడిపై వస్తున్న విమర్శలకు తాత్కాలికంగా అడ్డుకట్ట పడింది. కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత పరిమిత ఓవర్ల సిరీస్‌లలో టీమిండియా బాగానే రాణిస్తోంది.
టెస్టుల్లో వరుస పరాజయాలు, తీవ్ర ఒత్తిడి
గంభీర్ కోచింగ్ కెరీర్‌లో ఇటీవల జరిగిన చాంపియన్స్ ట్రోఫీ-2025 (ICC Champions Trophy) విజయం ఒక మధుర జ్ఞాపకంగా నిలిచింది. అయితే, టెస్టుల్లో మాత్రం గౌతమ్ గంభీర్ వచ్చాక బంగ్లాదేశ్ (Bangladesh)పై విజయం మినహా.. టీమిండియా వరుసగా దారుణ పరాజయాలను చవిచూసింది. స్వదేశంలో ఎన్నడూ లేని విధంగా న్యూజిలాండ్ (New Zealand) చేతిలో 3-0తో క్లీన్‌స్వీప్ అయింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా (Australia) పర్యటనలోనూ ఘోర పరాభవం చవిచూసింది. ఆసీస్ చేతిలో 3-1తో ఓడి దాదాపు పదేళ్ల తర్వాత తొలిసారి బోర్డర్- గవాస్కర్ ట్రోఫీని కోల్పోయింది.
ఈ క్రమంలో స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran) ఈ ట్రోఫీ మధ్యలోనే రిటైర్‌మెంట్ ప్రకటించగా, ఇంగ్లాండ్‌తో సిరీస్‌కు ముందు కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma), దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) కూడా టెస్టులకు స్వస్తి పలికారు. ఈ నేపథ్యంలో యువ ఆటగాడు శుబ్‌మన్ గిల్ (Shubman Gill) టెస్టు జట్టు పగ్గాలు చేపట్టగా, ఇంగ్లాండ్ పర్యటనలోనూ ఆరంభంలో చేదు అనుభవమే మిగిలింది. తొలి టెస్టులో టీమ్‌ఇండియా గెలవాల్సిన మ్యాచ్‌ను చేజార్చుకుంది. సంప్రదాయ ఫార్మాట్‌లో భారత్ ఇలా వరుసగా మ్యాచ్‌లు ఓడటంతో గంభీర్‌పై విమర్శల వర్షం కురిసింది. అతడిని కోచ్‌గా తొలగించాలనే డిమాండ్లు కూడా వచ్చాయి.
ఎడ్జ్‌బాస్టన్ గెలుపుతో ఊరట
ఇలాంటి తీవ్ర ఒత్తిడి నడుమ టీమ్‌ఇండియా తమకు అచ్చిరాని ఎడ్జ్‌బాస్టన్ వేదికపై ఇంగ్లాండ్‌పై భారీ విజయం సాధించింది. ఆతిథ్య జట్టుకు ఊహించని రీతిలో షాకిచ్చి, ఏకంగా 336 పరుగుల తేడాతో చిత్తు చేసింది. తద్వారా టెస్టుల్లో కెప్టెన్‌గా గిల్‌కు.. విదేశీ గడ్డపై కోచ్‌గా గంభీర్‌కు తొలి విజయమే మధురానుభూతిని మిగిల్చింది.