పంజాబ్ (Punjab)లో భారీ రైలు ప్రమాదం (Train Accident) తృటిలో తప్పింది. అమృత్‌సర్-సహర్సా (Amritsar–Saharsa) గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్లో (Garib Rath Express ) అకస్మాత్తుగా మంటలు చెలరేగినా, ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు.
శనివారం ఉదయం 7:30 గంటల ప్రాంతంలో రైలు నంబర్ 12204 అమృత్‌సర్ నుంచి సహర్సా వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. రైలులోని ఏసీ కోచ్ జీ-19లో మంటలు ప్రారంభమయ్యాయి. మంటలు వేగంగా వ్యాపిస్తున్న విషయాన్ని గమనించిన ఓ ప్రయాణీకుడు అప్రమత్తమై గొలుసు (చైన్) లాగడంతో రైలు ఆగిపోయింది. దీంతో ప్రయాణికులంతా వెంటనే కోచ్‌ల నుంచి సురక్షితంగా బయటకు దిగిపోయారు.
మంటలు స్వల్పంగా మరో రెండు కోచ్‌లకు కూడా తాకాయి. వెంటనే రైల్వే సిబ్బంది స్పందించి, మంటలు అంటుకున్న ఈ మూడు కోచ్‌లను రైలు నుంచి వేరు చేశారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చారు.
ఈ ఘటనలో కేవలం ఒక ప్రయాణీకురాలికి మాత్రమే స్వల్ప గాయాలయ్యాయి. రైల్వే బోర్డు తెలిపిన వివరాల ప్రకారం, 32 ఏళ్ల మహిళకు గాయాలవడంతో ఆమెను ఫతేఘర్ సాహిబ్‌లోని సివిల్ ఆస్పత్రికి తరలించినట్లు స్టేషన్ హౌస్ ఆఫీసర్ రత్తన్ లాల్ (Rattan Lal) వెల్లడించారు.
పెను ప్రమాదం తప్పడంతో అధికారులు, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరుగుతోందని వెల్లడించారు.








