టీ20 ప్రపంచకప్‌లో భాగంగా వెస్టిండీస్‌తో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో భారత్ విజయం సాధించి సెమీస్‌కి దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో 97 పరుగులతో మెరిసిన సంజూ శాంసన్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. అయితే ఈ సందర్భంగా భారత కోచ్ గౌతమ్ గంభీర్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
మ్యాచ్ అనంతరం స్పందించిన గంభీర్, క్రికెట్ అనేది ఒక్కరి ఆట కాదని, ఇది పదకొండు మంది కలిసి ఆడే జట్టు క్రీడ అని స్పష్టం చేశారు. భారీ స్కోర్లు చేసిన ఆటగాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం దక్కుతోందని, కానీ చిన్న చిన్న సహకారాలే జట్టును గెలుపు దిశగా నడిపిస్తాయని అన్నారు. వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌ను ఉదాహరణగా చూపిస్తూ, సంజూ శాంసన్ 97 పరుగులు చేసినా, చివరి ఓవర్లలో శివమ్ దుబే కొట్టిన రెండు బౌండరీలు కూడా అంతే కీలకమని పేర్కొన్నారు. ఒకవేళ ఆ ఫోర్లు రాకపోయి ఉంటే ఫలితం మారిపోయేదని గుర్తుచేశారు.
తాను కోచ్‌గా ఉన్నంత కాలం జట్టులో ప్రతి ఆటగాడి కృషికి సమాన గౌరవం ఉంటుందని గంభీర్ వెల్లడించారు. వ్యక్తిగత రికార్డుల కంటే జట్టు విజయమే తనకు ముఖ్యమని చెప్పారు. జట్టు కోసం కష్టపడే ప్రతి ఒక్కరి పాత్ర విలువైనదేనని ఆయన తేల్చి చెప్పారు. అయితే సోషల్ మీడియాలో గంభీర్ వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఆయన వ్యాఖ్యలను సమర్థిస్తుండగా, మరికొందరు సంజూ ప్రదర్శనను తగ్గించి చూపుతున్నారని విమర్శిస్తున్నారు.








