అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)కు మెక్సికో అధ్యక్షురాలు స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది. వలసదారుల బహిష్కరణ, మాదక ద్రవ్యాల నియంత్రణ, పరస్పర సుంకాల విధింపుపై కఠిన నిర్ణయాలు తీసుకుంటానని హెచ్చరించిన నేపథ్యంలో, మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షేన్‌బామ్ (Claudia Sheinbaum) ధైర్యంగా స్పందించారు. ట్రంప్ బెదిరింపులకు తాను భయపడేది లేదని స్పష్టం చేశారు.
విలేకరుల సమావేశంలో ట్రంప్ హెచ్చరికలపై స్పందిస్తూ “మెక్సికో ప్రజల మద్దతు నాకుంది. మా దేశ సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు ఏవిధమైన చర్యలకైనా సిద్ధంగా ఉన్నాం” అని షేన్‌బామ్ చెప్పారు. ట్రంప్ చేస్తున్న మిలిటరీ జోక్యం, సుంకాల విధింపులు, వలసదారులపై కఠిన చర్యలకు తాము వెనుకాడబోమని ఆమె స్పష్టం చేశారు.
పెరుగుతున్న ఉద్రిక్తత
అగ్రరాజ్యంలోకి ఫెంటానిల్ డ్రగ్ అక్రమ రవాణా, వలసదారుల ప్రవేశాన్ని కంట్రోల్ చేయడంలో మెక్సికో, కెనడా విఫలమయ్యాయని ట్రంప్ ఆరోపించారు. ఈ కారణంగా 25% సుంకాలు విధించనున్నట్లు ప్రకటించారు. అయితే, రెండు దేశాల కౌంటర్ చర్యల నేపథ్యంలో అమెరికా ఈ సుంకాలను తాత్కాలికంగా నెలరోజుల పాటు నిలిపివేసింది. ట్రంప్ నిర్ణయాలను తీవ్రంగా తీసుకున్న మెక్సికో, సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేయడానికి 10 వేల మంది సైనికులను మోహరించింది.