న్యూ ఇయర్ వేళ మద్యం సేవించి వాహనాలు డ్రైవ్ చేయకుండా, ప్రమాదాలను నివారించేందుకు తెలంగాణ ఫోర్ వీలర్స్ డైవర్స్ అసోసియేషన్ మరియు గిగ్ వర్కర్స్ అసోసియేషన్ ప్రత్యేక ఆఫర్ అందిస్తోంది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధుల్లో రాత్రి 10 గంటల నుంచి అర్ధరాత్రి 1 గంట వరకు 500 కార్లు, 250 బైక్ ట్యాక్సీలతో మద్యం తాగిన వ్యక్తులను వారి ఇంటికి సురక్షితంగా చేరవేస్తారు.
ఫోర్ వీలర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి
తెలంగాణ ఫోర్ వీలర్స్ డైవర్స్ అసోసియేషన్ (TGPWU) ప్రెసిడెంట్ షేక్ సలావుద్దీన్ మాట్లాడుతూ.. తాగి డ్రైవింగ్ చేయడం వల్ల ప్రజల భద్రతకు తీవ్ర ముప్పు వాటిల్లుతుందని, నూతన సంవత్సర వేడుకల తర్వాత తాగి వాహనాలు నడపడం వల్ల కలిగే నష్టాలను తొలగించేందుకు తాము #HumAapkeSaathHai ప్రచారాన్ని ప్రారంభించామని తెలిపారు. ఈ సేవలను వినియోగించుకోవాలని, అనవసర ప్రమాదాలను నివారించవచ్చని సూచించారు. ఎవరైనా రైడ్ చేయాలనుకునే వారు 9177624678కి కాల్ చేయవచ్చని కోరారు. మద్యం తాగి, స్వంతంగా ఇంటికి వెళ్ళే స్థితిలో లేని వారు ఉచిత రైడ్‌ను పొందవచ్చు అని సలావుద్దీన్ తెలిపారు.