దేశవ్యాప్తంగా ఉచిత HPV టీకా ప్రారంభం.. HPV అంటే తెలుసా..?

దేశవ్యాప్తంగా ఉచిత HPV టీకా ప్రారంభం.. HPV అంటే తెలుసా..?

బాలికల ఆరోగ్య రక్షణ (Girls’ Health Protection) లక్ష్యంగా ఉచిత HPV టీకా కార్యక్రమాన్ని ఫిబ్రవరి 28 నుంచి కేంద్ర ప్ర‌భుత్వం దేశ‌ వ్యాప్తంగా ప్రారంభించింది. ఈ జాతీయ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి న‌రేంద్ర మోడీ (Narendra Modi) రాజస్థాన్‌లోని అజ్మీర్‌ (Ajmer) నుంచి అధికారికంగా ప్రారంభించారు. దేశవ్యాప్తంగా కోట్లాది బాలికలకు ఈ టీకా అందించేందుకు విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. దేశంలో మహిళల్లో వేగంగా పెరుగుతున్న గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ (Cervical Cancer) నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం 14–15 సంవత్సరాల బాలికలకు ఉచితంగా HPV టీకా (HPV Vaccine) ఇవ్వనున్నారు. ప్రతి సంవత్సరం సుమారు 1.15 కోట్ల బాలికలను లక్ష్యంగా పెట్టుకుని ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పాఠశాలల ద్వారా టీకా పంపిణీ చేయనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని దశలవారీగా అమలు చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి చంద్ర‌బాబు, తెలంగాణలో మంత్రి దామోద‌ర రాజ‌న‌ర్సింహ‌ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో Gardasil-4 అనే HPV వ్యాక్సిన్‌ను ఉపయోగిస్తున్నారు. ఇది రెండు డోసులుగా ఇవ్వబడుతుంది. నాలుగు రకాల HPV వైరస్‌ల నుంచి రక్షణ కల్పిస్తుంది. 9 నుంచి 14 ఏళ్ల మధ్య వయస్సులో టీకా తీసుకుంటే అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 2006 నుంచి అందుబాటులో ఉన్న ఈ వ్యాక్సిన్ ఇప్పటికే కోట్లాది మందికి ఇవ్వబడింది.

భారత్‌లో గర్భాశయ క్యాన్సర్ (Cervical Cancer) మహిళల్లో రెండవ అత్యంత సాధారణ క్యాన్సర్‌గా ఉంది. ప్రతి సంవత్సరం సుమారు 80 వేల కొత్త కేసులు నమోదవుతుండగా, 42 వేలకుపైగా మహిళలు ప్రాణాలు కోల్పోతున్నారు. కలుషిత పరిస్థితులు, పరిశుభ్రత లోపం, బలహీన రోగనిరోధక శక్తి, చిన్న వయస్సులో వివాహం వంటి అంశాలు ఈ వ్యాధి ప్రమాదాన్ని పెంచుతున్నాయి. 30 ఏళ్ల తర్వాత మహిళలు క్రమం తప్పకుండా స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

HPV టీకా కార్యక్రమం మహిళల ఆరోగ్య రక్షణలో ఒక చారిత్రాత్మక అడుగుగా భావిస్తున్నారు. భవిష్యత్తులో గర్భాశయ క్యాన్సర్ కేసులను గణనీయంగా తగ్గించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ప్రారంభ దశలోనే అవగాహన పెంచి, టీకా పంపిణీ సమర్థవంతంగా జరిగితే మహిళల ప్రాణాలను కాపాడటంలో ఇది కీలక పాత్ర పోషించనుంది.

Join WhatsApp

Join Now

Leave a Comment