ఫార్ములా -ఈ కార్ రేసు కేసులో ఏ3గా ఉన్న బీఎల్ఎన్ రెడ్డి (BLN Reddy) ఈడీ విచారణకు గైర్హాజరయ్యారు. విచారణకు మరింత సమయం కావాలని కోరుతూ హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డి ఈడీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌కు మెయిల్ పంపించారు. ఈ నేపథ్యంలో ఈడీ అధికారులు ఆయనను మరోసారి విచారణకు పిలిచేందుకు నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది.
కేసులో బీఎల్ఎన్ రెడ్డి ఏ3 నిందితుడిగా ఉన్నారు. గురువారం ఈడీ ఆయనను విచారించాల్సి ఉన్నప్పటికీ, ఆయన గైర్హాజరు అయ్యారు. అలాగే అరవింద్ కుమార్ (IAS), బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కూడా విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఫార్ములా – ఈ రేసు నిర్వహణ కోసం హెచ్ఎండీఏ ఖాతా నుండి లండన్‌లోని ఫార్ములా ఈ-ఆపరేషన్స్ (SEO) ఖాతాకు బదిలీ అయిన డబ్బు గురించి ఈడీ విచారణ చేయాలని నిర్ణయించింది.
దాన కిషోర్ ఫిర్యాదు మేరకు మొదట ఈ కేసును తెలంగాణ రాష్ట్ర ఏసీబీ అధికారులు నమోదు చేసినప్పటికీ నగదు బదిలీలో అవకతవకలు ఉన్నట్లుగా ఆరోపణలు రావడంతో ఈ కేసులోకి ఈడీ ఎంటర్ అయ్యింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ముగ్గురిని విచారణకు రావాలని నోటీసులు జారీ చేసింది.