ఫార్ములా ఈ-కారు రేస్ కేసు కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి HMDA ఉన్నతాధికారులతో కీలక సమావేశం నిర్వహించారు. మంగళవారం జరిగిన ఈ సమావేశంలో మున్సిపల్ శాఖతో సంబంధిత నిధుల బదలాయింపు అంశంపై చర్చ జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా ఫార్ములా ఈ-కారు రేసు కేసుకు సంబంధించిన వివాదాలు, హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ కేటీఆర్ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్, మరియు ఏసీబీ కేసును కొట్టివేయాలని కోరుతూ కేటీఆర్ హైకోర్టుకు సమర్పించిన క్వాష్ పిటిషన్ తదితర అంశాలపై సవివరంగా చర్చలు జరిగాయి.
సుప్రీం కోర్టుకు కేటీఆర్
ఫార్ములా ఈ-కారు రేసు కేసులో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో కేటీఆర్ తరఫున న్యాయవాది మోహిత్ రావు పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో సుప్రీం కోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వనుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.