కూటమి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న వాసంశెట్టి సుభాష్‌కు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ హర్షకుమార్ వార్నింగ్ ఇచ్చారు. మంత్రి సుభాష్ పేరుతో అమలాపురంలో దాడులు, దౌర్జన్యాలు, భూకబ్జాలు, రౌడీయిజం పెచ్చుమీరుతోందని, అవన్నీ ఆపకపోతే చాలా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
అంబాజీపేట మండలం పసుపల్లి గ్రామానికి చెందిన ఏసీ మెకానిక్ గంటి కిరణ్ కుమార్‌పై ఇద్దరు యువకులు దాడి చేశారు. ఆ యువకుల్లో ఒకరు ‘తాను మంత్రి వాసంశెట్టి సుభాష్ రైట్ హ్యాండ్ కొడుకుని’ అంటూ దాడికి పాల్పడ్డారని బాధితుడు కిరణ్‌కుమార్ తెలిపారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కిరణ్‌ను మాజీ ఎంపీ హర్షకుమార్ పరామర్శించారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మంత్రి సుభాష్‌కు వార్నింగ్ ఇచ్చారు. తాను ఎంపీగా కొనసాగుతున్న సమయంలో సుభాష్ తండ్రి కౌన్సిలర్‌గా ఉన్నాడని గుర్తుచేశారు. చిన్న వయస్సులో, చాలా తక్కువ టైమ్‌లో సుభాష్‌కు పెద్ద స్థాయి లభించిందని, ఆ స్థాయికి తగినట్లుగా వ్యవహరించాలని సూచించారు. ఎంతమంది స్నేహితులు ఉన్నా.. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నప్పుడు హుందాగా వ్యవహరించాలన్నారు.
భగవంతుడు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, మంత్రి సుభాష్ పేరుతో అమలాపురంలో దాడులు, దౌర్జన్యాలు జరిగితే ఇకమీదట సహించేది లేదని తేల్చిచెప్పారు. మొన్న ఒక స్థలం ఆక్రమణ విషయంలో కూడా మంత్రి సుభాష్ పేరు వచ్చిందని, అమలాపురంలో జరిగే ప్రతి అరాచకం వెనుక మంత్రి పేరు ప్రస్తావనకు వస్తుందని ఇది మంచిది కాదన్నారు. అమలాపురం చాలా ప్రశాంతమైన ప్రాంతమని, ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవాలని, లేదంటే పరిస్థితి మరోలా ఉంటుందని హెచ్చరించారు.