రాష్ట్రంలో రైతు బతికే పరిస్థితి లేదు.. – వైఎస్ జ‌గ‌న్‌

రాష్ట్రంలో రైతు బతికే పరిస్థితి లేదు.. - వైఎస్ జ‌గ‌న్‌

అన్న‌పూర్ణ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అన్న‌దాత బ‌తికే ప‌రిస్థితి లేద‌ని వైసీపీ అధినేత‌, మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులు చాలా కష్టాలు పడుతున్నారని, రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు.. రాష్ట్రంలో ఏ ఒక్క రైతూ సంతోషంగా లేడ‌న్నారు. గిట్టుబాటు ధ‌ర లేక అవ‌స్థ‌లు ప‌డుతున్న మిర్చి రైతుల‌ను వైఎస్ జ‌గ‌న్ ప‌రామ‌ర్శించారు. గుంటూరు మిర్చియార్డ్‌లో రైతుల‌ను క‌లిసి వారితో మాట్లాడారు. పంటకు ప్ర‌స్తుత‌మున్న ధ‌ర గురించి వాక‌బు చేశారు.

రూ.11వేల ధ‌ర కూడా లేదు..
అనంత‌రం వైఎస్ జ‌గ‌న్ మీడియాతో మాట్లాడుతూ కూట‌మి ప్ర‌భుత్వంపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. చంద్ర‌బాబు ప్ర‌భుత్వం రైతుల పాలిట శాపంగా మారిందన్నారు. వైసీపీ హయాంలో రైతు రాజుగా బ‌తికాడ‌ని, వ్య‌వసాయం పండగలా సాగింద‌ని చెప్పారు. ప్ర‌తి పంట‌కూ రైతులు నష్టపోకుండా గిట్టుబాటు ధర కల్పించామ‌ని చెప్పారు. మిర్చి రైతుల అవస్థలు చంద్రబాబుకు పట్టడం లేదని వైఎస్ జ‌గ‌న్ అన్నారు. మిర్చి పంటకు కనీసం రూ.11వేలు కూడా గిట్టుబాటు ధర లేదని, పండించిన పంట‌ను అమ్ముకోలేని దుస్థితి రైతులు ఉన్నార‌న్నారు.

రైతుల‌ను ద‌ళారీల‌కు అమ్మేసే ప‌రిస్థితి
వైసీపీ హయాంలో మిర్చి క్వింటా ధ‌ర రూ.21 వేల నుంచి రూ.27 వేల వరకు ఉండేద‌ని, ప్ర‌స్తుతం రూ.11 వేల‌కు ప‌డిపోవ‌డం దారుణ‌మ‌న్నారు. ఈ రోజు కనీసం రూ.15వేలకు కూడా కొనే నాథుడు లేడన్నారు. రైతులను దళారీలకు అమ్మేసే పరిస్థితిని సీఎం చంద్ర‌బాబు క‌ల్పించాడ‌న్నారు. ఆర్బీకే వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారని, ఈ రోజు ఎరువులు బ్లాక్ లో కొనాల్సిన పరిస్థితి, వ‌స్తుందో, రాదో తెలియ‌ని పెట్టుబడి సాయం కోసం రైతులు ఎదురుచూడాల్సిన ప‌రిస్థితి నెల‌కొంద‌న్నారు. సీఎం చంద్రబాబు ఇప్పటికైనా కళ్లు తెరిచి, రైతుల కష్టాలు తెలుసుకోవాలని సూచించారు. లేదంటే రాబోయే రోజుల్లో రైతుల తరఫున ఉద్యమిస్తామ‌ని వైఎస్ జ‌గ‌న్ హెచ్చ‌రించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment