కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ సందర్శనకు వచ్చిన ఐదుగురు యువకులు మృత్యువాతపడ్డారు. సెల్ఫీ సరదా యువకుల కుటుంబాల్లో విషాదఛాయలు నింపింది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌కు చెందిన ఏడుగురు యువకులు ఇవాళ ఉదయం కొండపోచమ్మ సాగర్ చూసేందుకు వచ్చారు. రిజర్వాయర్ వద్ద నీటిలో కాసేపు సరదాగా గడిపిన యువకులు సెల్ఫీ దిగేందుకు ప్రయత్నిస్తుండగా వారంతా డ్యామ్‌లో పడి గల్లంతయ్యారు. ఇది గమనించిన స్థానికులు వారిని రక్షించే ప్రయత్నాలు చేశారు. కానీ, అప్పటికే ఐదుగురు యువకులు మరణించారు. మిగిలిన ఇద్దరిని సురక్షితంగా కాపాడగలిగారు. రెస్క్యూ టీమ్ మృతదేహాల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి
సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలంలోని కొండపోచమ్మ డ్యాంలో యువకులు గల్లంతై మృతి చెందిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని, ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గల్లంతైన యువకుల కోసం గజ ఈతగాళ్లతో సహాయ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
రూ.15 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలి
యువకుల మృతిపై బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే హరీశ్‌రావు విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, పండుగ వేళ బిడ్డల్ని కోల్పోయి బాధలో ఉన్న కుటుంబాలకు రూ.15 లక్షల చొప్పున పరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు.