ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన మంగళగిరి పానకాల నరసింహస్వామి కొండపై అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గుర్తుతెలియని వ్యక్తులు కొందరు కొండకు నిప్పు అంటించారు. దీంతో మంటలు తీవ్ర స్థాయిలో ఎగసిపడ్డాయి. ఎగువ నుంచి మంటలు దిగువకు వ్యాపించాయి. శనివారం సాయంత్రం 7 గంటలకు మొదలైన మంటలు.. రాత్రి 9 గంటల వరకు దావానంలా వ్యాప్తించాయి.
సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది పానకాల నరసింహస్వామి కొండకు చేరుకొని మంటలను ఆర్పేందుకు ప్రయత్నించగా అధికారుల చర్య ఏమాత్రం ఫలితం ఇవ్వలేదు. కొండ ఎగువ నుంచి దిగువకు మంటలు వ్యాపిస్తున్న తరుణంలో దిగువన ఉన్న పూరిపాక నివాసితులు ఆందోళన చెందారు. చివరకు మంటలను అర్పివేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కొండపై అగ్నిప్రమాద ఘటన గుర్తు తెలియని వ్యక్తుల పనేనని పోలీసులు భావిస్తున్నారు. వారిని గుర్తించేందుకు విచారణ మొదలుపెట్టారు.