ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) లోని షాజహాన్‌పూర్ (Shahjahanpur) లో హృదయాన్ని కదిలించే ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ తండ్రి తన నలుగురు పిల్లలను గొంతు కోసి హత్య (Murder) చేసి, చివరికి తానూ ఉరివేసుకుని ఆత్మహత్య (Suicide) చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు ఫోరెన్సిక్ బృందం (Forensic Team)తో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.
ఏం జరిగింది?
ఈ విషాద ఘటన రోజా పోలీస్ స్టేషన్ పరిధిలోని మాన్పూర్ చాచారి (Manpur Chachari) గ్రామంలో జరిగింది. రాజీవ్ (Rajeev) అనే వ్యక్తి తన భార్య పుట్టింటికి వెళ్లిన వేళ, పిల్లలతో కలిసి ఇంట్లో ఒంటరిగా ఉన్నాడు. బుధవారం రాత్రి 13 ఏళ్ల స్మృతి (Smriti) , 9 ఏళ్ల కీర్తి (Keerthi) , 7 ఏళ్ల ప్రగతి (Pragati) , 5 ఏళ్ల రిషబ్ (Rishabh) అనే తన నలుగురు పిల్లల్ని (Four children) గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు.
రాజీవ్ తండ్రి బాబా (Baba) ఇంటి బయట నిద్రిస్తున్నాడు. తెల్లవారుజామున ఇంటి తలుపులు తెరవడానికి ప్రయత్నించగా, లోపలి నుంచి తాళం వేసి ఉందని గమనించాడు. ఏదో విధంగా ఇంట్లోకి ప్రవేశించిన ఆయన.. ఆ దారుణ దృశ్యం చూసి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. రక్తపు మడుగులో పడి ఉన్న పిల్లల్ని చూసి కుదేలైన బాబా, వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాజీవ్ ఈ ఘాతుకానికి ఎందుకు పాల్పడ్డాడో తెలుసుకునేందుకు దర్యాప్తు (Investigation) ముమ్మరం చేశారు.