స్కూల్ నుంచి ఆలస్యంగా వచ్చాడని, కొడుకుని కొట్టి చంపిన తండ్రి

స్కూల్ నుంచి ఆలస్యంగా వచ్చాడని, కొడుకుని కొట్టి చంపిన తండ్రి

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని ఆరేగూడేం గ్రామంలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. కొడుకు స్కూల్ నుంచి ఆలస్యంగా వచ్చాడన్న కోపంతో విచక్షణ రహితంగా కొట్టి, అతని ప్రాణాలను బలిగొన్నాడు. ఈ ఘటన ఫిబ్రవరి 8న జరిగినప్పటికీ, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

చౌటుప్పల్ మండల ప‌రిధిలోని ఆరెగూడెం గ్రామానికి చెందిన కట్ట సైదులు లారీ డ్రైవర్‌. సైదులు- నాగమణి దంప‌తుల‌కు ముగ్గురు కుమారులు. సైదులు చిన్న కొడుకు భానుప్రసాద్ (14) చౌటుప్పల్‌లోని ప్రైవేట్ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. పిల్లల చదువుల కోసం ఆరెగూడెం నుంచి వచ్చి చౌటుప్పల్ నివాసం ఉంటున్నారు. భానుప్ర‌సాద్‌ స్కూల్‌లో శనివారం రాత్రి సీనియర్లకు ఫేర్‌వెల్ పార్టీ నిర్వహించారు. పార్టీ అనంత‌రం రాత్రి 8 గంటల తర్వాత భానుప్రసాద్ ఇంటికి వచ్చాడు. అప్పటికే తండ్రి సైదులు మ‌ద్యం మ‌త్తులో ఇంటికి వచ్చాడు. కొడుకు ఆలస్యంగా వ‌చ్చాడ‌ని ఆగ్రహంతో విచక్షణరహితంగా కొట్టాడు.

ఛాతీపై పిడిగుద్దులు, కాలితో తన్నడంతో భానుప్రసాద్ అపస్మారక స్థితికి చేరుకున్నాడు. బాలుడిని వెంటనే చౌటుప్పల్ ప్రభుత్వాస్ప‌త్రికి తర‌లించ‌గా, అప్పటికే భానుప్ర‌సాద్ మృతిచెందాడు. దీంతో ఆగ్ర‌హించిన త‌ల్లి త‌న భ‌ర్తే త‌న కొడుకు చావుకు కార‌ణ‌మ‌ని పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పిల్లలపై హింసను నివారించే చట్టాలను మరింత కఠినతరం చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment