రూ.4,215 కోట్ల ‘ఫాల్కన్’ కేసులో పురోగ‌తి.. ఎండీ అమ‌ర్‌దీప్‌ అరెస్ట్

ఫాల్కన్ ఇన్వాయిస్ కేసులో పురోగ‌తి.. ఎండీ అమ‌ర్‌దీప్‌కు రిమాండ్‌

ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ కేసు (Falcon Invoice Discounting Case)లో తెలంగాణ సీఐడీ (Telangana CID) కీలక పురోగతి సాధించింది. భారీ ఆర్థిక మోసానికి పాల్పడ్డట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ సంస్థ ఎండీ అమర్‌దీప్ కుమార్‌ (Amardeep Kumar)ను సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఇరాన్ నుంచి ముంబైకి తిరిగివచ్చిన అమర్‌దీప్ కుమార్‌ను లుక్ అవుట్ సర్క్యులర్ (LOC) ఆధారంగా ముంబై ఎయిర్‌పోర్ట్‌లో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ట్రాన్సిట్ రిమాండ్‌పై హైదరాబాద్‌ (Hyderabad)కు తరలించారు.

సీఐడీ విచారణలో వెలుగులోకి వచ్చిన వివరాల ప్రకారం, నకిలీ వెబ్‌సైట్, మొబైల్ యాప్ ద్వారా ఇన్వెస్ట్‌మెంట్ పేరుతో అమాయకులను మోసం చేసినట్లు అధికారులు గుర్తించారు. ప్రతిష్టాత్మక ఎంఎన్‌సీల పేర్లను ఉపయోగిస్తూ ఫేక్ ఇన్వాయిస్ డీల్స్ చూపించి, అధిక లాభాలు వస్తాయని ఆశ చూపి డిపాజిటర్ల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు తేలింది. ఈ స్కామ్‌లో మొత్తం రూ.4,215 కోట్ల డిపాజిట్లు సేకరించగా, 7,056 మంది డిపాజిటర్లు, 4,065 మంది బాధితులు ఉన్నట్లు సీఐడీ వెల్లడించింది. ఈ మోసం వల్ల బాధితులకు సుమారు రూ.792 కోట్ల నష్టం వాటిల్లిందని అధికారులు అంచనా వేశారు.

బాధితుల ఫిర్యాదుల ఆధారంగా మొదట ఈ కేసులు సైబరాబాద్ ఈఓడబ్ల్యూ (EOW)లో నమోదు కాగా, తర్వాత కేసును తెలంగాణ సీఐడీకి బదిలీ చేశారు. సీఐడీ అదనపు డీజీపీ చారు సిన్హా పర్యవేక్షణలో దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటివరకు ఈ కేసులో మొత్తం 11 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఇందులో డైరెక్టర్లు, ఎగ్జిక్యూటివ్స్‌తో పాటు ఒక చార్టర్డ్ అకౌంటెంట్ కూడా ఉన్నారు.

దర్యాప్తులో భాగంగా నిందితులకు సంబంధించిన రూ.43 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. 12 ప్లాట్లు, 4 లగ్జరీ కార్లు సీజ్ చేయడంతో పాటు రూ.8 లక్షల నగదు, 21 తులాల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా RDP షేర్లు, బ్యాంక్ బ్యాలెన్సులను కూడా అటాచ్‌మెంట్‌కు తీసుకున్నట్లు సీఐడీ తెలిపింది.

ప్రస్తుతం మోసపూరితంగా సేకరించిన డబ్బు ఎటువైపు వెళ్లిందనే మార్గాన్ని గుర్తించే పనిలో తెలంగాణ సీఐడీ అధికారులు నిమగ్నమై ఉన్నారు. ఈ కేసుకు సంబంధించిన మరిన్ని కీలక వివరాలు దర్యాప్తులో వెలుగులోకి వచ్చే అవకాశముందని తెలంగాణ సీఐడీ తన అధికారిక ప్రకటనలో వెల్లడించింది.

Join WhatsApp

Join Now

Leave a Comment