హైదరాబాద్ శివార్లలో బుధవారం (జనవరి 1) డ్రగ్ కంట్రోల్ అధికారులు భారీ నకిలీ మెడిసిన్ రాకెట్‌ను చేధించారు. ప్రముఖ ఫార్మాస్యూటికల్ కంపెనీల పేరుతో నకిలీ మందులు తయారు చేస్తూ, ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టే గ్యాంగ్‌ను గుర్తించారు. ఈ దాడిలో అధికారులు ఏకంగా రూ.2 కోట్ల విలువైన మందులను స్వాధీనం చేసుకున్నారు.
సీజ్ చేసిన వాటిలో మోంటెక్ ఎల్సీ ట్యాబ్లెట్లతో పాటు ఇతర నకిలీ మెడిసిన్స్ ఉన్నాయి. ఈ ఫ్యాక్టరీ హైదరాబాద్ శివార్లలోని జిన్నారంలో ఉన్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. అక్కడే ఈ నకిలీ మందుల తయారీ కొనసాగుతోంది.
దాడులు ముమ్మరం
ఇటీవలి కాలంలో హైదరాబాద్ నగరంలో డ్రగ్ కంట్రోల్ అధికారులు నకిలీ మందులు, కాలం చెల్లిన ఔషధాల విక్రయంపై దాడులను మరింత కఠినంగా చేస్తున్నారు. ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారే ఈ మెడిసిన్‌లను పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకుంటూ, నేరస్తులపై కేసులు నమోదు చేస్తున్నారు.