ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో నకిలీ మద్యం (Fake Liquor) తయారీ కేసులో సంచలన అంశాలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా బయటపడ్డ రిమాండ్ రిపోర్ట్ ప్రకారం, నిందితులు పోలీసుల ఎదుట నకిలీ మద్యం తయారీ, విక్రయాలను అంగీకరించారు. ఈ రాకెట్ వెనుక టీడీపీ (TDP) నేత జనార్థన్ రావు (Janardhan Rao), అతని సోదరుడు జగన్‌మోహన్ రావు (Jaganmohan Rao) ప్రధాన పాత్ర పోషించినట్లు ఎక్సైజ్ అధికారులు స్పష్టం చేశారు.
పోలీసుల దర్యాప్తులో వెల్లడైన వివరాల ప్రకారం, అధిక లాభాలు ఆర్జించాలనే ఆశతో నకిలీ మద్యం తయారీని జగన్‌మోహన్‌రావు ప్రారంభించాడు. గత నాలుగు నెలలుగా మొలకల చెరువు ప్రాంతంలో ఈ అక్రమ డెన్‌ను నడిపినట్లు రిపోర్ట్ చెబుతోంది. అంతకు ముందు, సుమారు మూడు నెలల క్రితం ఇబ్రహీంపట్నం (Ibrahimpatnam)లో మరో తయారీ కేంద్రం ఏర్పాటు చేసి, అక్కడ తయారైన మద్యం వివిధ వైన్ షాపులు, బెల్ట్ షాపులు, బార్లకు సరఫరా చేసినట్లు అధికారులు గుర్తించారు.
దర్యాప్తులో భాగంగా, నకిలీ లేబుళ్ల తయారీకి హైదరాబాద్(Hyderabad)కు చెందిన రవి(Ravi) అనే వ్యక్తి బాధ్యత వహించినట్లు తేలింది. మొలకల చెరువులో తయారు చేసిన మద్యం, ఇబ్రహీంపట్నం కేంద్రానికి తరలించి అక్కడి నుంచి రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. అలాగే, బెంగళూరు(Bengaluru)కు చెందిన బాలాజీ ఈ రాకెట్‌లో కీలక పాత్ర పోషించాడని విచారణలో తేలింది. నకిలీ బాటిళ్లకు అసలైనట్లు కనిపించే ఫేక్ సీల్స్ను బాలాజీ బెంగళూరు నుంచే పంపించినట్లు పోలీసులు నిర్ధారించారు.
నిందితులపై పోలీసులు A.P. Excise (Amendment) Act, 2020 కింద పలు కఠిన సెక్షన్లను నమోదు చేశారు. U/sec.13(e), 13(1), 34(a) r/w 34(a)(1)(ii), 34(e), 34(f), 34(h), 34(2), 36(1)(b)(c), 37, 42, 50, 50(B).
దర్యాప్తులో బయటపడిన వివరాల ప్రకారం, నకిలీ బాటిళ్లపై సీల్స్‌ను ఒరిజినల్‌లా తయారు చేయడం వల్ల మద్యం అసలైనదా నకిలీయా అనే అనుమానం రాకుండా సులభంగా విక్రయాలు కొనసాగించగలిగారు.
ఎక్సైజ్ అధికారులు ఈ రాకెట్ పరిమాణం, నెట్వర్క్ రాష్ట్రవ్యాప్తంగా విస్తరించిందని చెబుతూ మరిన్ని అరెస్టులు చేసే అవకాశముందని సంకేతాలు ఇచ్చారు. ఈ ఘటనతో మద్యం వ్యాపారంలో నకిలీ ఉత్పత్తుల ప్రభావం ఎంత పెద్దదో మరోసారి బయటపడింది.







