గుంటూరు (Guntur) జిల్లా (District)లో గ్యాంగ్ సినిమా (Gang Movie) రిపీట్ అయ్యింది. ఆ సినిమా కథలో హీరో సూర్య (Surya) నకిలీ ఏసీబీ(ACB) అధికారులను సృష్టించి బంగారం షాపులో రైడ్స్(Raids) చేసినట్లుగా.. గుంటూరులో ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) అధికారులుగా నటించిన దుండగులు, ఒక ముడి బంగారం వ్యాపారిని లక్ష్యంగా చేసుకుని రూ.70 లక్షల నగదుతో పాటు అతని స్నేహితుడిని కూడా ఎత్తుకెళ్లారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టిస్తోంది.
మహారాష్ట్ర (Maharashtra)కు చెందిన జగదీష్ (Jagadish), రంజిత్ (Ranjith) అనే ఇద్దరు వ్యక్తులు బంగారు నగల తయారీ షాపులో పనిచేస్తున్నారు. ఇటీవల రంజిత్ తన దగ్గర రెండు కేజీల ముడి బంగారం ఉందని, దానిని విక్రయించాలనుకుంటున్నానని జగదీష్‌కు తెలిపాడు. దీనిపై స్పందించిన జగదీష్, సుమారు రూ.70 లక్షల నగదుతో వ్యాపార నిమిత్తం సత్తెనపల్లికి చేరుకున్నాడు.
అయితే వ్యాపారం ముగించుకొని తిరిగి విజయవాడకు వెళ్తుండగా, మేడికొండూరు ఈద్గా వద్ద కారును గుర్తుతెలియని వ్యక్తులు అడ్డగించారు. ‘‘మేము ఈడీ అధికారులు’’ అంటూ పరిచయం చేసుకుని, కారులో ఉన్న డబ్బును లాక్కొని రంజిత్‌ను కూడా బలవంతంగా తీసుకెళ్లారు.తర్వాత రంజిత్ ఫోన్‌కాల్స్‌కు స్పందించకపోవడంతో, జగదీష్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సంఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌లు, ఫోన్ కాల్ రికార్డులు సేకరిస్తున్నామని తెలిపారు.