వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. అక్రమ తవ్వకాలు, పేలుడు పదార్థాల దుర్వినియోగం వంటి ఆరోపణలపై కాకాణి గోవర్ధన్ రెడ్డి (Kakani Govardhan Reddy) ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. నెల్లూరు (Nellore) జిల్లా పొదలకూరు (Podalakur) పోలీస్ స్టేషన్‌లో ఇటీవల నమోదు అయిన కేసులో ఆయనను A4 నిందితుడిగా ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు.
ఈ కేసు క్వార్ట్జ్ (Quartz) అక్రమ తవ్వకాలు, రవాణా, మరియు నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాల వినియోగానికి సంబంధించినదన్న అభియోగాలు మోపారు. అయితే కేసు నమోదైన తర్వాత కాకాణి గోవర్ధన్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. నెలలుగా ఆయన ఆచూకీ లేకపోవడంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
ఆదివారం ఆయనను బెంగళూరు (Bengaluru) సమీపంలో పోలీసులు అరెస్ట్ చేసి నెల్లూరుకు తరలించారు. ప్రస్తుతం ఆయనను జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రం (District Training Centre)లో ఉంచారు. భద్రత కారణంగా మీడియాను అక్కడికి అనుమతించడం లేదు. డీటీసీ ప్రాంతానికి కిలోమీటరు దూరంలోనే ఇతర వాహనాలను నిలిపివేస్తున్నారు. కాసేపట్లో కాకాణిని వెంకటగిరి (Venkatagiri) కోర్టులో హాజరుపర్చనున్నారు. ఈ కేసు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపే అవకాశముంది. అధికార, విపక్ష పార్టీల మధ్య ఆరోపణల యుద్ధానికి ఇది కారణమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.