బీజేపీ ఎంపీ (BJP MP) ఈటల రాజేందర్ (Etela Rajender) కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government)పై తీవ్ర విమర్శలు గుప్పించారు. శనివారం (ఆగస్టు 2) హైదరాబాద్ (Hyderabad) ఇందిరా పార్క్ (Indira Park)లో జరిగిన ఓబీసీ (OBC) మహాధర్నాలో మాట్లాడుతూ, బీసీలను మోసం చేస్తున్నారని రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రభుత్వాన్ని నిలదీశారు.
బీఆర్‌ఎస్ హయాంలో బీసీలకు అన్యాయం
“బీఆర్‌ఎస్(BRS) పాలనలో బీసీ వాటా 23%కి పడిపోయింది. బీసీలను మర్చిపోయిన పార్టీకి, వారిపై మాట్లాడే నైతిక హక్కు లేదు” అని ధ్వజమెత్తిన ఈటల, బీసీలను మిగిలిన పార్టీలన్నీ వ్యతిరేకించాయని ఆరోపించారు.
రేవంత్ హామీలు – అమలేంటి?
“కామారెడ్డి (Kamareddy) బీసీ డిక్లరేషన్ (BC Declaration)లో విద్య, ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తామని రేవంత్ హామీ ఇచ్చారు. కానీ 20 నెలలు గడిచినా అమలు జాడలేదని” ఆవేదన వ్యక్తం చేశారు. “ప్రజలు మోసపోయామన్నారు. రిజర్వేషన్ల పేరుతో రేవంత్ రెడ్డి బీసీలను మోసం చేస్తున్నారు” అని అన్నారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్ సొమ్ములు మంజూరు చేయండి
“విద్యార్థులు అనేక కష్టాలు పడుతున్నారు. పాత పద్ధతిలోనే ఫీజు రీయింబర్స్‌మెంట్ (Fee Reimbursement) బకాయిలు చెల్లించాలి. లేదంటే సీఎం నీ భరతం పడతాం” అని హెచ్చరించారు.
రిజర్వేషన్లపై చట్టబద్ధత – తమిళనాడు ఉదాహరణ
బీసీ రిజర్వేషన్లపై రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన కమిషన్ ఇచ్చిన సిఫార్సులు చట్టబద్ధమైనవేనా? అని ప్రశ్నించారు. “తమిళనాడు 9వ షెడ్యూల్‌లో చేర్చి రిజర్వేషన్లను సాధించింది. అలాగే ఆర్టికల్ 340, 1942 కమిషన్ ఎంక్వైరీ ప్రకారం ముందుకెళ్లాలి” అని సూచించారు.
బీసీలకు అసలు ఏమిచ్చారు?
“రేవంత్ రెడ్డికి నిజంగా బీసీల పట్ల బాధ్యత ఉంటే, మంత్రివర్గంలో వారికి ఇచ్చిన శాఖలు ఏమిటి చెప్పాలి. కాంగ్రెస్ పాలనలో బీసీ సీఎం ఎప్పుడైనా చేశారా? భవిష్యత్తులో చేస్తారన్న నమ్మకం లేదు” అని వ్యాఖ్యానించారు.
హెచ్చరిక
“బీసీ హక్కులు తాకట్టు పెడితే, మేము ఊరుకోము. హామీలను అమలు చేయకపోతే ముఖ్యమంత్రి భరతం పడతాం” అని ఈటల స్పష్టం చేశారు.