‘కేసీఆర్ మా బాస్’ – ఘర్ వాపసీకి ఈట‌ల సిద్ధ‌మా?

'కేసీఆర్ మా బాస్' – ఘర్ వాపసీకి ఈట‌ల సిద్ధ‌మా?

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి సంచలన చర్చకు తెరలేపారు మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్. తాజాగా ఇచ్చిన ఓ ప‌బ్లిక్ మీటింగ్‌ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా “కేసీఆర్ మా బాస్” అనే వ్యాఖ్య ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ వ్యాఖ్యలతో ఈటల తిరిగి బీఆర్ఎస్ పార్టీలోకి చేరేందుకు పరోక్ష సంకేతాలు ఇస్తున్నారా? అనే అనుమానాలు బలపడుతున్నాయి.

తాజా ఇంటర్వ్యూలో ఈటల రాజేందర్ బీఆర్ఎస్‌పై ఎలాంటి విమర్శలు చేయలేదు. గతంలో తీవ్ర విమర్శలు చేసిన కేసీఆర్‌పై కూడా ఈసారి సానుకూలంగా మాట్లాడటం గమనార్హం. అదే సమయంలో బీజేపీ భవిష్యత్తు, పార్టీ అంతర్గత పరిస్థితులు, నాయకత్వంపై అడిగిన ప్రశ్నలకు మాత్రం “నాకు ఏమీ తెలియదు” అంటూ సమాధానాలు దాటవేశారు.

“బీఆర్ఎస్‌ను ఖతం చేస్తాం” అంటూ బీజేపీ నేతలు బండి సంజయ్, ధర్మపురి అరవింద్ చేసిన వ్యాఖ్యలపై స్పందించాల్సిన సమయంలో ఈటల “అవి నాకు తెలియవు” అంటూ తప్పించుకోవడం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలపై ప్రశ్నించగా కూడా ఆయన స్పష్టమైన సమాధానం ఇవ్వకుండా మౌనం వహించారు.

బీజేపీలో నెలకొన్న గ్రూపు రాజకీయాలు ఈటలను తీవ్రంగా నిరాశపరిచినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా బండి సంజయ్‌తో తరచూ తలెత్తిన విభేదాలు, పార్టీ లోపల సరైన మద్దతు లేకపోవడం ఆయన అసంతృప్తికి కారణంగా మారినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఈటల పోరాటం చేస్తున్నా, ఇతర బీజేపీ నేతలు బహిరంగంగా మద్దతివ్వకపోవడం ఆయనను మరింత ఒంటరిగా మార్చిందని సమాచారం.

కాంగ్రెస్ నేతలు కులం పేరుతో ఈటలపై విమర్శలు చేసిన సందర్భాల్లోనూ బీజేపీ నేతలు ఖండించకపోవడం ఆయనకు తీవ్ర అసహనాన్ని కలిగించినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలన్నింటినీ బేరీజు వేసుకున్న ఈటల, ఇటీవల కాలంలో బీజేపీ అధికారిక కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.

“కేసీఆర్ మా బాస్” అనే వ్యాఖ్యతో పాటు బీఆర్ఎస్‌పై అనుకూల‌మైన‌ వైఖరి అవలంబించడం, బీజేపీపై మౌనం పాటించడం ఈటల రాజేందర్ రాజకీయ భవిష్యత్తుపై పెద్ద నిర్ణయం తీసుకునే దశకు చేరుకున్నారా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. త్వరలోనే ఆయన రాజకీయ ప్రయాణం ఏ దిశగా మలుపు తిరుగుతుందన్నది తెలంగాణ రాజకీయాల్లో కీలక అంశంగా మారింది.

Join WhatsApp

Join Now

Leave a Comment