బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన 25 మంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా సిద్ధమవుతున్నట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రి స్థానం నుంచి రేవంత్‌ను దించేందుకు వారంతా ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన సంచలన ఆరోపణలు చేశారు.
తొర్రూరు మండలంలో జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న ఎర్రబెల్లి.. సీఎం రేవంత్ రెడ్డి పోకడలకు వ్యతిరేకంగా 25 మంది ఎమ్మెల్యేలు ఒక్కటయ్యారని, ఇది సర్కార్ కూలిపోడానికి మొదటి సంకేతమని ఆరోపించారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను కారణంగా కాంగ్రెస్‌లో కీలక మార్పులు ఉండొచ్చని అంచనా వేశారు. ప్రజలను కాపాడుకునే కేసీఆర్ పార్టీని ఓడించి తప్పు చేశామనే భావనలో తెలంగాణ ప్రజలంతా ఉన్నారన్నారు. రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ వంద సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ కార్యకర్తలంతా నిత్యం ప్రజల్లో ఉండాలని, ధైరంగా ముందుకు వెళ్లాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించే దిశగా కృషి చేయాలన్నారు. కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా తాను అండగా ఉంటానన్నారు.







