ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో మంట‌లు.. విజ‌య‌వాడ వాసి మృతి

ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో మంట‌లు.. విజ‌య‌వాడ వాసి మృతి

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం (Andhra Pradesh State), అన‌కాప‌ల్లి జిల్లాలో రైలు ప్ర‌మాదం చోటుచేసుకుంది. టాటానగర్‌ (జార్ఖండ్‌) నుంచి ఎర్నాకుళం (కేరళ) వెళ్తున్న ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌ (18189) (Ernakulam Express – Train No. 18189) రైలులో తీవ్ర అగ్నిప్రమాదం (Fire Accident) జ‌రిగింది. ఈ ఘటనలో విజయవాడ (Vijayawada)కు చెందిన చంద్రశేఖర్‌ సుందర్‌ (Chandrasekhar Sunder) (70) అనే ప్రయాణికుడు మృతి చెందినట్లు అధికారులు ధృవీకరించారు. మిగతా ప్రయాణికులంతా సురక్షితంగానే బయటపడ్డారని, మంటలు పూర్తిగా అదుపులోకి రావడంతో సహాయక చర్యలు ముగిసినట్లు రైల్వే శాఖ ప్రకటించింది.

ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత, సుమారు రాత్రి 1.30 గంటల సమయంలో య‌లమంచిలి (Yelamanchili) సమీపంలోని పాయింట్‌ వద్ద రైలులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ విషయాన్ని గమనించిన లోకో పైలట్లు వెంటనే రైలును య‌లమంచిలి స్టేషన్‌లో నిలిపివేశారు. ప్రమాదాన్ని గుర్తించిన వెంటనే ప్రయాణికులంతా బోగీల నుంచి బయటకు దిగి ప్రాణాలు కాపాడుకున్నారు.

బోగీలను వేరు చేసిన లోకో పైలట్లు
మంటలు వ్యాపించకుండా ఉండేందుకు లోకో పైలట్లు (Loco Pilots) కాలిపోతున్న బీ1, ఎం2 బోగీలను రైలు నుంచి వేరు చేశారు. సమాచారం అందుకున్న అనకాపల్లి, య‌లమంచిలి, నక్కపల్లి ఫైర్‌ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే అప్పటికే రెండు బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ఘటనపై దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్‌ డీఆర్‌ఎం మోహిత్‌ స్పందించారు. ఆయన మాట్లాడుతూ, “మొదటగా బీ1 కోచ్‌లో మంటలు చెలరేగినట్లు అనుమానిస్తున్నాం. ఆ బోగీలో దుప్పట్లు ఎక్కువగా ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించాయి. ప్రమాద సమయంలో బీ1 కోచ్‌లో 76 మంది, ఎం2 కోచ్‌లో 82 మంది ప్రయాణికులు ఉన్నారు. ఒకరు మృతి చెందగా, మిగతా వారంతా సురక్షితంగా బయటపడ్డారు. బ్రేకులు అకస్మాత్తుగా పట్టేయడం వల్లే మంటలు చెలరేగి ఉండవచ్చని లోకో పైలట్లు చెబుతున్నారు. అయితే దీనిపై అధికారిక దర్యాప్తు జరుగుతోంది” అని తెలిపారు.

మృతుడి కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం
ఈ ఘటనలో మృతి చెందిన చంద్రశేఖర్‌ సుందర్‌ కుటుంబానికి రైల్వే శాఖ రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. మృతదేహాన్ని బీ1 బోగీలో గుర్తించినట్లు అధికారులు తెలిపారు. టెక్నికల్‌ క్లియరెన్స్‌ అనంతరం ప్రమాదానికి గురైన రెండు బోగీలతో పాటు మరో బోగీని (ఎం2) మినహాయించి, సోమవారం ఉదయం 7 గంటల ఆలస్యంగా రైలును ఎర్నాకుళం వైపు బయల్దేరేలా చేశారు. కాలిపోయిన బోగీల్లోని ప్రయాణికులను మిగతా బోగీల్లో సర్దుబాటు చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment