ఏలూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం మూడు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. గురువారం తెల్లవారుజామున సోమవరప్పాడు హైవే వద్ద జరిగిన ఈ దుర్ఘటన అందరినీ కలచివేసింది. సిమెంటు లారీని వెనుక నుంచి ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మందికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు, పోలీసులు కలిసి క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ప్రమాదానికి గురైన బస్సు హైదరాబాద్ నుంచి కాకినాడ వెళ్తున్న రమణ ట్రావెల్స్ బస్సుగా గుర్తించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను ఆస్పత్రి మార్చరీకి తరలించారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో ఈ ప్రమాదానికి అతి వేగం, నిద్రమత్తే కారణమని తేలింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.