ఏపీలో మరో దారుణమైన ఘటన వెలుగుచూసింది. తునిలో బాలికపై వృద్ధుడి అఘాయిత్యం ఘటన మరిచిపోకముందే ఏలూరులో మరో దారుణం చోటుచేసుకుంది. సోమవారం అర్ధరాత్రి మైనర్ బాలికపై దుండగులు లైంగిక దాడికి పాల్పడ్డ ఘటన కలకలం రేపుతోంది.
వివరాల్లోకి వెళ్తే.. ఏలూరులోని 12 పంపుల సెంటర్ సమీపంలోని పూలకొట్టు ప్రాంతంలోని సందులో ఒక బాలిక అపస్మారక స్థితిలో పడి ఉండడాన్ని స్థానికులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాలికను ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
వైద్యులు ప్రాథమిక పరీక్షల అనంతరం బాలికపై లైంగిక దాడి జరిగి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. పూర్తిస్థాయి వైద్యపరీక్షల తర్వాత స్పష్టత వస్తుందని తెలిపారు. బాలిక మద్యం మత్తులో ఉండటంతో దుండగులు ఆమెకు బలవంతంగా మద్యం తాగించి దారుణానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. బాలిక స్కూల్ యూనిఫామ్‌లో ఉండటంతో ప్రైవేట్ పాఠశాల విద్యార్థినిగా అనుమానం వ్యక్తమవుతోంది. ఆమె ఇప్పటికీ అపస్మారక స్థితిలో ఉండటంతో పూర్తి వివరాలు తెలియరాలేదు.
ఏలూరు టూ టౌన్ సీఐ అశోక్ కుమార్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. ఆ ప్రాంతంలో మద్యం దుకాణం, గంజాయి వాడకుల సంచారం ఎక్కువగా ఉండటంతో పోలీసులు పలు కోణాల్లో విచారణ చేస్తున్నారు. బాలిక స్పృహలోకి వచ్చాకే నిజాలు వెలుగులోకి వస్తాయని అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ, రాష్ట్రంలో బాలికలకు రక్షణ లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.








