అమెరికా (America)లో రాజకీయ వేడి మరింత పెరుగుతున్న తరుణంలో, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk) తన కొత్త రాజకీయ పార్టీ ‘అమెరికా పార్టీ’ (America Party)ని ప్రకటిస్తూ సంచలనం సృష్టించారు. ట్రంప్ (Trump)తో విభేదాల నేపథ్యంలో మస్క్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
వివరాల్లోకి వెళితే..
అమెరికా అధ్యక్షుడు ట్రంప్, బిలియనీర్ ఎలాన్ మస్క్ మధ్య బంధం బలపడినప్పటి నుండి, వారి మధ్య విభేదాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. తాజాగా ట్రంప్ ఒప్పందపరచుకున్న “వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్” (One Big Beautiful Bill) చట్ట రూపం దాల్చిన నేపథ్యంలో, మస్క్ తన కొత్త పార్టీ ఏర్పాటును ప్రకటించారు.
అమెరికా 249వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ట్రంప్ చేసిన నిర్ణయానికి వ్యతిరేకంగా, ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించాలనే ఉద్దేశంతో “అమెరికా పార్టీ” (America Party)ని స్థాపిస్తున్నట్లు మస్క్ తెలిపారు.
ఎక్స్ లో ప్రకటన
మస్క్ తన సోషల్ మీడియా వేదిక ఎక్స్ లో పోస్ట్ చేస్తూ, “ఈ రోజు మీకు మీ స్వేచ్ఛను తిరిగి ఇవ్వడానికి అమెరికా పార్టీ ఏర్పడింది” అని వెల్లడించారు. ఒక సర్వే ఫలితాలను షేర్ చేస్తూ, 65.4% మంది కొత్త పార్టీ ఏర్పాటును సమర్థించారని తెలిపారు.
ఈ సర్వేలో 2:1 నిష్పత్తిలో ప్రజలు కొత్త రాజకీయ పార్టీ అవసరం ఉందని వెల్లడించారని మస్క్ పేర్కొన్నారు. ప్రజల ఆశయాలను ప్రతిబింబించేలా కొత్త రాజకీయ వేదికను తీసుకురావాల్సిన అవసరం ఉందని అన్నారు.
ప్రస్తుత రాజకీయ వ్యవస్థపై విమర్శ
మస్క్, ప్రస్తుతం అమెరికా రెండు ప్రధాన పార్టీలు — రిపబ్లికన్ మరియు డెమోక్రటిక్ పార్టీలు ప్రజలకు ప్రత్యామ్నాయం ఇవ్వడంలో విఫలమయ్యాయని విమర్శించారు. ‘‘మన దేశాన్ని వ్యర్థం, అవినీతితో దివాలా తీసే దిశగా తీసుకెళ్తున్నారు. ఇది ప్రజాస్వామ్యం కాదు, ఒకరకంగా ఏకపార్టీ పాలన’’ అని మండిపడ్డారు.
మస్క్ కొత్త పార్టీ ప్రకటనతో అమెరికన్ రాజకీయాల్లో ఊహించని మలుపు ఏర్పడింది. ఇది వాస్తవంగా ఎంత ప్రభావం చూపుతుందో చూడాల్సి ఉంది, కానీ వాస్తవం ఏమిటంటే.. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని మస్క్ స్పష్టం చేశారు.








