అమెరికా (America)లో రాజకీయ రంగంలో సెన్సేషనల్ సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk) తన రాజకీయ పార్టీ “అమెరికా పార్టీ” (“America Party”) ను ప్రకటించడంతో, ఈ ప్రకటనపై అగ్రరాజ్య ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తీవ్రంగా స్పందించారు. మస్క్ నిర్ణయాన్ని “అసంబద్ధమైన చర్య” గా అభివర్ణించారు.
ట్రంప్ వ్యాఖ్యల ప్రకారం.. అమెరికాలో రెండు ప్రధాన పార్టీలు.. రిపబ్లికన్ (Republican), డెమొక్రటిక్ (Democratic) ఇప్పటికే రాజకీయ వ్యవస్థలో తమ సుస్థిర స్థానం ఏర్పరచుకున్నాయని, మూడో పార్టీకి అటువంటి అవకాశాలు ఎప్పుడూ లేవని అన్నారు. “అమెరికా చరిత్రలో మూడో పార్టీ విజయవంతం పొందలేదు” అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు.
“మస్క్ అదుపు తప్పిపోయారు”
ఎలాన్ మస్క్‌పై వ్యక్తిగతంగా తీవ్ర విమర్శలు చేస్తూ ట్రంప్, “గత ఐదు వారాలుగా మస్క్ పూర్తిగా అదుపు తప్పిపోయారు. ఆయనను చూస్తే జాలేస్తోంది” అంటూ ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు. EV మాండేట్‌ను రద్దు చేసే తన బిల్లుకు మస్క్ మొదట మద్దతు ఇచ్చినా, ఇప్పుడు వ్యతిరేకంగా వ్యవహరిస్తుండటం ఆశ్చర్యంగా ఉందన్నారు. అంతేకాదు, NASA చీఫ్ పదవికి మస్క్ ఒక డెమొక్రాట్ వ్యక్తిని సిఫార్సు చేయడంతో, అది రిపబ్లికన్ వ్యతిరేక చర్యగా కనిపించిందని ట్రంప్ అన్నారు.
మస్క్ రాజకీయంగా దూకుడు
బిగ్ బ్యూటిఫుల్ బిల్లుకు వ్యతిరేకంగా మస్క్ గతంలో నుంచి విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ బిల్లు ఆమోదం పొందిన వెంటనే అమెరికా పార్టీ పెట్టనున్నట్టు ప్రకటించిన ఆయన, శనివారం రాత్రి తన సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ద్వారా ‘అమెరికా పార్టీ’ స్థాపనను అధికారికంగా వెల్లడించారు. అమెరికాలో రెండు ప్రధాన పార్టీలు ఒక్కటే అయ్యాయి. ప్రజల స్వేచ్ఛను తిరిగి తీసుకురావడమే నా లక్ష్యం” అంటూ మస్క్ ప్రకటించారు. అంతేకాదు 65% మంది ప్రజలు మూడవ పార్టీకి మద్దతు ఇస్తున్నారని ఒక పోల్‌ను కూడా ఉటంకించారు.








