ఎల్లంపేట్ మున్సిపాలిటీ పరిధిలోని బండమాదారంలో ఎన్నికల తరువాత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 9వ వార్డు నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి విజయలక్ష్మి ఓటమి అనంతరం, ఆమె భర్త ఆకుల సురేష్ ఓటర్ల వద్దకు వెళ్లి ఎన్నికల సమయంలో ఇచ్చిన డబ్బు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేయడం కలకలం రేపింది. టికెట్ నిరాకరణతో సురేష్ తన భార్యను బరిలో దింపగా, ఫలితాల్లో ఆమె మూడో స్థానంలో నిలిచారు. ఓటు కోసం ఇచ్చిన డబ్బు తిరిగి ఇవ్వాలని సురేష్ పట్టుబట్టడంతో గ్రామంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
తాము మీకే ఓటు వేశామని ఓటర్లు చెప్పినా, ఆలయంలో ప్రమాణం చేయాలని సురేష్ కోరడంతో వారు తిరగబడ్డారు. “ఎన్నికల సమయంలో అందరూ వస్తారు.. డబ్బులు ఇస్తారు.. కానీ ఓటు మాత్రం నచ్చిన వారికి వేస్తాం. అందరికీ ఎలా వేస్తాం?” అంటూ ఓటర్లు ప్రశ్నించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారి చర్చనీయాంశమైంది. ఎన్నికల వ్యవహారాల్లో డబ్బు ప్రభావం మరోసారి వెలుగులోకి వచ్చిన సంఘటనగా ఇది మారింది.








