తిరుపతి జిల్లాలో శనివారం అర్ధరాత్రి ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించి ఓ వ్యక్తిని పొట్టనపెట్టుకుంది. చంద్రగిరి మండలంలోని మామిడి మానుగడ్డ గ్రామంలో పంట పొలాల్లోకి ప్రవేశించిన ఏనుగులు రైతులపై దాడి చేశాయి. ఈ దాడిలో కందుల వారి పల్లి ఉపసర్పంచ్ రాకేష్ చౌదరి మృతి చెందారు.
దాడి వివరాలు
శనివారం అర్ధరాత్రి ఏనుగుల గుంపు పంట పొలాల్లోకి చొరబడటం గమనించిన రైతులు, వాటిని తరిమికొట్టేందుకు ప్రయత్నించారు. దీంతో ఏనుగులు రైతులవైపు దూసుకొచ్చాయి. ఈ క్రమంలో అందరూ పరుగులు తీయగా, రాకేష్ చౌదరి కిందపడిపోయారు. ఏనుగులు అతనిపై దాడి చేయడంతో తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. రాకేష్ చౌదరి కందుల వారి పల్లి ఉపసర్పంచ్‌గా ఉండటమే కాకుండా, చంద్రగిరి మండల ఐటీడీపీ అధ్యక్షుడిగానూ సేవలందించారు. ఈ సంఘటన ఆయన కుటుంబం, గ్రామస్తులకు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
పరిష్కార మార్గాలు అవసరం
తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఏనుగుల దాడులు పెరుగుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. పంట పొలాలపై జంతువుల దాడులను నివారించేందుకు అటవీశాఖ మరింత సమర్థమైన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని కోరుతున్నారు.