భారత ఎన్నికల సంఘం (India’s Election Commission) పనితీరు మళ్లీ ప్రశ్నార్థకంగా మారింది. విశాఖపట్నం (Visakhapatnam) జిల్లా అగనంపూడి నిర్వాసిత కాలనీలో ఓటరుపై జరిగిన తప్పిదం ఆ వ్యవస్థ పనితీరును అనుమానించేలా ఉంది. 56 ఏళ్ల ఓటరు(Voter)ను 225 ఏళ్ల వయసుగల వ్యక్తిగా నమోదు చేయడం ఈసీ గుడ్డితనానికి ఉదాహరణగా మారిందంటున్నారు ప్రజాస్వామ్యవాదులు. ఓటరు కార్డు(Voter Card)లో పుట్టిన తేదీని 01.01.1800గా నమోదు చేయడంపై స్థానికులు, సామాజిక కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఘటనపై పట్టా రామ అప్పారావు (Patta Rama Apparao) మండిపడుతూ.. విశాఖపట్నం అగనంపూడి నిర్వాసిత కాలనీ కొండయ్యవలసకు చెందిన తన సోదరుడు 1969లో జన్మించారని, ఆయన వయసు 56 ఏళ్లు నిండిందని తెలిపారు. అయితే ఆయన ఓటరు కార్డులో మాత్రం పుట్టిన తేదీ 01.01.1800గా నమోదై ఉండడం చూసి విస్మయం వ్యక్తం చేశారు. “ఇంత నిర్లక్ష్యంగా ఓటరు నమోదు ఎలా జరుగుతుంది? అని ప్రశ్నించారు. బ్యాంకింగ్ లావాదేవీలకు ఆధార్‌ను తప్పనిసరి చేసే ప్రభుత్వం, ఎన్నికల సంఘం మాత్రం ఓటరు నమోదు ప్రక్రియలో ఆధార్ అనుసంధానం చేయకపోవడం ఘోర వైఫల్యమని ఆయన విమర్శించారు. ఇది ఎన్నికల వ్యవస్థలో ఉన్న అవ్యవస్థకు నిదర్శనమని పేర్కొన్నారు.
ప్రజాస్వామ్యం బలమైన ఆధారం నిష్పాక్షికమైన ఎన్నికల వ్యవస్థ. కానీ ఈసీ(EC) లాంటి రాజ్యాంగ సంస్థ నిర్లక్ష్యంగా వ్యవహరించడం, తగిన చర్యలు తీసుకోకపోవడం ప్రజల్లో నమ్మకం దెబ్బతినేలా చేస్తోంది. ఎన్నికల సంఘం వెంటనే తగిన చర్యలు తీసుకుని, తప్పిదాలను సరిదిద్దకపోతే ప్రజాస్వామ్యం పట్ల అవమానం జరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.