మధ్యప్రదేశ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య ఎనిమిదికి చేరింది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న అతిపెద్ద ఆధ్యాత్మిక మహోత్సవం కుంభమేళాకు వెళ్లి తిరిగి వస్తుండగా మినీ బస్సు లారీ కొట్టింది. ఈ ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన ఏడుగురు అక్కడికక్కడే మరణించగా, తీవ్ర గాయాలతో నవీన్ ఆచార్య అనే వ్యక్తి చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.
హైదరాబాద్ నాచారం కార్తికేయనగర్‌కు చెందిన పలువురు మహాకుంభమేళాకు మినీ బస్సులో బయల్దేరి వెళ్లారు. ప్రయాగ్‌రాజ్‌లో పుణ్యస్నానం పూర్తిచేసుకొని హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమైన సమయంలో మార్గమధ్యలో మంగళవారం ఉదయం జబల్‌పూర్ జిల్లా సిహోరా వద్ద సిమెంట్ లోడ్‌తో వెళ్తున్న లారీ వీరి వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో ఘటనా స్థలంలోనే ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం సమయంలో వాహనంలో దాదాపు 14 మంది వరకు ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదంపై పలువురు రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.