టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబు (Mahesh Babu)కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate – ED) నుంచి నోటీసులు వచ్చాయి. ఈనెల 27వ తేదీన విచారణ కోసం తమ కార్యాలయానికి హాజరుకావాలని ఈడీ సూచించింది. ఈ పరిణామంతో టాలీవుడ్ వర్గాల్లో చిన్నపాటి కలకలం రేగింది.
సాయిసూర్య డెవలపర్స్ (Sai Surya Developers) అనే నిర్మాణ సంస్థకు గతంలో మహేష్ బాబు ప్రచారకర్తగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కంపెనీతో పాటు, దానికి అనుబంధంగా ఉన్న సురానా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ (Surana Group of Companies)పై ఈడీ దాడులు జరిపింది. ఆ దర్యాప్తులో భాగంగా మహేష్ బాబుకు ఈ సంస్థల నుంచి జరిగిన లావాదేవీల వివరాలను గుర్తించింది.
ప్రచార రుసుములపై సందేహాలు
ఈడీ సమాచారం ప్రకారం, మహేష్ బాబు సాయిసూర్య డెవలపర్స్ కు ప్రచారం అందించేందుకు సుమారు రూ.5.9 కోట్లు తీసుకున్నట్టు చెబుతోంది. ఇందులో కొంత మొత్తాన్ని ఆన్‌లైన్ ద్వారా బదిలీ చేసినప్పటికీ, మిగతా మొత్తాన్ని క్యాష్ రూపంలో చెల్లించారని గుర్తించారు. ఈ నగదు లావాదేవీలపై ఈడీకి అనుమానాలున్నట్టు సమాచారం.ఈడీ దర్యాప్తులో సాయిసూర్య డెవలపర్స్, సురానా గ్రూప్ లపై పలు అక్రమాలు, అవకతవకలు వెలుగులోకి వచ్చాయి. – అక్రమంగా లే-అవుట్లు వేయడం, ఒకే ప్లాట్‌ను అనేక మందికి అమ్మడం, ఎటువంటి అగ్రిమెంట్లు లేకుండా డబ్బులు వసూలు చేయడం, ప్లాట్లకు సంబంధించి తప్పుడు హామీలు ఇవ్వడం ఇలా అనేక అంశాల్లో సంస్థల దుర్మార్గాలపై ఈడీకి సుదీర్ఘంగా సమాచారం లభించింది.
వంద కోట్ల లావాదేవీలు ఈడీ రాడార్‌లో..
ప్రస్తుతం ఈడీ దృష్టి రూ.100 కోట్లకు పైగా జరిగిన అనుమానాస్పద లావాదేవీలపై ఉంది. ఈ మొత్తం లోపల మహేష్ బాబుకు చెల్లించిన రుసుములు కూడా ఉండటంతో, ఆయన్ను విచారణకు పిలవాల్సి వచ్చిందని తెలుస్తోంది.