మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salman), తన వేఫేరర్ ఫిలింస్ బ్యానర్ (Wayfarer Films Banner)పై నిర్మించిన చిత్రం ‘కొత్త లోక: చాప్టర్ 1’ (Kotha Loka: Chapter 1). డొమినిక్ అరుణ్ (Dominic Arun) దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కళ్యాణి ప్రియదర్శన్ (Kalyani Priyadarshan) ప్రధాన పాత్రలో నటించగా, ‘ప్రేమలు’ ఫేమ్ నస్లీన్ (Nasleen) కీలక పాత్ర పోషించారు. ‘కొత్త లోక’ సినిమాటిక్ యూనివర్స్‌లో మొదటి భాగమైన ఈ సినిమా ఓనం కానుకగా విడుదలైంది. మొదటి రోజు నుంచే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని భారీ వసూళ్లను రాబడుతోంది.
ఈ సినిమా గురించి నిర్మాత దుల్కర్ సల్మాన్ ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, “‘కొత్త లోక’ సినిమా కోసం పెట్టిన పెట్టుబడి (Investment) మొత్తం కోల్పోతామని అనుకున్నాం. ఈ సినిమా కథ నాకు చాలా నచ్చింది, ఇది మంచి సినిమా అని మాకు తెలుసు. కానీ బడ్జెట్ ఎక్కువగా అయ్యింది. మలయాళంలో ఇంత బడ్జెట్ అంటే చాలా రిస్క్. అయినా కథపై నమ్మకంతో ముందుకెళ్లాను.
అయితే, డిస్ట్రిబ్యూటర్లు థియేట్రికల్ హక్కులు కొనుగోలు చేయడానికి అంతగా ఆసక్తి చూపలేదు. ‘లోక’ ఫ్రాంచైజీని మొదలుపెడితే, సీక్వెల్స్‌లో లాభం పొందవచ్చని అనుకున్నాను. ఆ నమ్మకంతోనే సినిమాను విడుదల చేశాం. కానీ, ఈ విజయం ఊహించనిది. మొదటి రోజు నుంచే మా సినిమా సూపర్ హిట్ టాక్‌తో భారీ వసూళ్లు సాధించి, సెన్సేషన్ క్రియేట్ చేసింది. అలాగే, మా నిర్మాణ సంస్థకు భారీ లాభాలు తెచ్చిపెట్టింది” అని అన్నారు.








