తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రాత్రి వేళ డ్రంక్ అండ్ డ్రైవ్, డ్రగ్ డిటెక్షన్ టెస్టులకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఈరోజు రాత్రి 8 గంటల నుంచి రేపు ఉదయం 7 గంటల వరకు ప్రత్యేక తనిఖీలు నిర్వహించనున్నారు. మద్యం సేవించి డ్రైవ్ చేస్తే కఠిన శిక్షలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
మద్యం సేవించి పట్టుబడితే..
మొదటి సారి పట్టుబడితే.. రూ.10,000 జరిమానా, 6 నెలల జైలు శిక్ష విధించనున్నారు. అదే, రెండో సారి కూడా పట్టుబడితే రూ.15,000 జరిమానా, జైలు శిక్ష, 3 నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ చేయనున్నారు. డ్రగ్స్ కేసుల్లో మరింత కఠిన చర్యలు ఉంటాయని, డ్రగ్స్ సేవించి పట్టుబడిన వారు నాన్-బెయిలబుల్ కేసులు ఎదుర్కొంటారని హెచ్చరిస్తున్నారు.
న్యూయర్ పార్టీస్ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం కఠిన ఆంక్షలను అమలు చేస్తోంది. ఇప్పటికే పోలీస్ శాఖ పబ్‌ల నిర్వాహకులకు ఆదేశాలు ఇచ్చింది. న్యూయర్ పార్టీలో డ్రగ్స్ వాడబోమని వారిచేత లిఖిత పూర్వకంగా దస్త్రం రాయించుకుంది. నిబంధనలను ఉల్లంఘిస్తే పబ్ లైసెన్స్ రద్దు, సీజ్ చేయడంతో పాటు నిర్వాహకులకు కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులను కూడా ముమ్మరం చేయనున్నారు.