అండమాన్ నికోబార్ పోలీసులు రూ.36 వేల కోట్ల విలువైన 6000 కిలోల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకుని, వాటిని మంటల్లో కాల్చి బూడిద చేశారు. అండమాన్ సముద్రంలోని బారెన్ ఐలాండ్ సమీపంలో స్వాధీనం చేసిన ఈ డ్రగ్స్‌ను ప్రత్యేక ఏర్పాట్లతో నిప్పుల బట్టిలో దహనం చేశారు. పోలీసు డిపార్ట్‌మెంట్ ఈ ఆపరేషన్‌ను DGP హరగోపిందర్ సింగ్ ధలివాల్ నేతృత్వంలో విజయవంతంగా నిర్వహించింది. దేశంలోనే అత్యధిక విలువ కలిగిన డ్రగ్స్‌ను ధ్వంసం చేసిన ఈ చర్యకు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో మరియు హోమ్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ పూర్తిస్థాయి సహకారం అందించిందని అధికారులు తెలిపారు.
గత ఏడాది నవంబర్‌లో సముద్ర మార్గం గుండా వస్తున్న ఈ డ్రగ్స్‌ను అండమాన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అండమాన్ సముద్రంలోని బారెన్ ఐలాండ్ సమీపంలో మయన్మార్‌కు చెందిన ఆరుగురు వ్యక్తులు ఈ డ్రగ్స్‌ను థాయ్‌లాండ్‌కు తరలిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. 6 వేల కిలోల మెథాంఫేటమిన్‌ను తరలిస్తున్న బోటును సీజ్ చేసి డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకోవడంతో పాటు మయన్మార్‌కు చెందిన ఆరుగురిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
దేశంలో మాదక ద్రవ్యాల నిరోధానికి మరో అడుగు
ఈ ఘనత దేశంలోని మాదక ద్రవ్యాల నిరోధక చర్యలకు కొత్త ఉదాహరణగా నిలుస్తోంది. తక్కువ సమయంలో ఈ డ్రగ్స్‌ను పూర్తిగా ధ్వంసం చేయడంలో అధికారులు ప్రణాళికాబద్ధంగా పనిచేశారు. అండమాన్ పోలీసులు తీసుకున్న ఈ చర్యకు దేశవ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయి.