డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా (Dr. B. R. Ambedkar Konaseema District) ద్రాక్షారామం (Draksharamam) శైవక్షేత్రంలో (Shaiva Temple) కోనేటి శివలింగం (Koneti Shiva Lingam) ధ్వంస ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. దీంతో పోలీసుల విచారణ వేగవంతమైంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. రామచంద్రపురం మండలం తోటపేట గ్రామానికి చెందిన 38 ఏళ్ల శీలం శ్రీనివాస్ (Seelam Srinivas)ను విచారిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించిన పోలీసులు, అతడిని అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు.
ప్రాథమిక విచారణలో అర్చకుడిపై ఉన్న కోపంతోనే శివలింగాన్ని ధ్వంసం చేసినట్లు అనుమానితుడు అంగీకరించినట్టు సమాచారం. ఆలయంలో జరిగే పూజల విషయంలో శ్రీనివాస్‌కు అర్చకుడితో పలుమార్లు ఘర్షణలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఆ వ్యక్తిగత కోపమే చివరకు దారుణ ఘటనకు దారి తీసిందని పోలీసులు చెబుతున్నారు. పూర్తి ఆధారాలు బయటకు రావాల్సి ఉంది.
ఈ ఘటనపై రాజకీయ రంగు కూడా సంతరించుకుంది. నిందితుడి సోదరుడు టీడీపీ(TDP) కార్యకర్తగా ఉన్నాడన్న ప్రచారం స్థానికంగా జరుగుతోంది. అయితే ఈ అంశంపై పోలీసులు ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. ఘటన వెనుక మరెవరైనా ఉన్నారా? రాజకీయ ప్రేరణ ఉందా? అనే కోణాల్లోనూ విచారణ కొనసాగుతోందని పోలీసులు స్పష్టం చేశారు.
ద్రాక్షారామానికి వైసీపీ నేతలు
ఇదిలా ఉండగా, కోనసీమ ద్రాక్షారామంలో వైసీపీ నేతలు పర్యటించారు. నూతన శివలింగ పునఃప్రతిష్ట జరిగిన ప్రాంతాన్ని ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పరిశీలించారు. విచారణ పూర్తి కాకుండానే శివలింగం పునఃప్రతిష్ట చేయడంపై ఆలయ ఈవో దుర్గాభవానీపై ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.








