డొనాల్డ్ ట్రంప్ సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు (భారత కాలమానం ప్రకారం రాత్రి 10:30 గంటలకు) అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వాషింగ్టన్ డీసీలోని యూఎస్ క్యాపిటల్ బిల్డింగ్‌లో చీఫ్ జస్టిస్ జాన్ రాబర్ట్స్ డొనాల్డ్ ట్రంప్‌తో ప్రమాణం చేయించనున్నారు. సాంప్రదాయంగా క్యాపిటల్ బిల్డింగ్ వెలుపల నిర్వహించే ఈ కార్యక్రమం, ఆర్కిటిక్ బ్లాస్ట్ కారణంగా లోపలికి మారింది.
ఈ ప్రమాణ స్వీకారంలో ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖులు పాల్గొనబోతున్నారు. అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలే, బిలియనీర్లు ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్, ముఖేష్ అంబానీతో పాటు పలు దేశాల ప్రముఖులు ఈ వేడుకకు హాజరవుతున్నారు.
- తొలి రోజే 10 సంచలన ఉత్తర్వులు?
- అక్రమ వలసదారులను దేశం నుంచి తొలగించడానికి మొదటి ఆదేశంపై ట్రంప్ సంతకం చేయనున్నారు. ఇది అమెరికా చరిత్రలోనే తొలి భారీ బహిష్కరణ కానుంది.
- అమెరికాలో పుట్టిన ప్రతీ ఒక్కరికి పౌరసత్వం ఇవ్వడం ఇకపై కొనసాగదు. విదేశీయుల పిల్లలకు ఈ హక్కు రద్దు చేస్తూ ట్రంప్ నిర్ణయం తీసుకోనున్నారు.
- 2021 జనవరి 6న జరిగిన కాపిటల్ దాడి నిందితులకు క్షమాభిక్ష జారీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయనున్నారు.
- రష్యా-యూక్రెయిన్ యుద్ధానికి ముగింపు. 24 గంటల్లోనే ఈ యుద్ధాన్ని ముగించే దిశగా చర్చలు జరుపుతానని ట్రంప్ తెలిపారు.
- మెక్సికో, కెనడా వంటి దేశాల నుంచి వస్తువులపై దిగుమతి సుంకాలు పెంచుతానని ట్రంప్ స్పష్టం చేశారు.
- విద్యుత్ వాహనాలకు బైడెన్ తీసుకున్న నిర్ణయాలను రద్దు చేస్తూ చర్యలు తీసుకోనున్నారు.
- అమెరికాలో చమురు నిల్వల ఉత్పత్తిని మరింతగా పెంచుతానని ట్రంప్ తెలిపారు.
- మహిళల విభాగాల్లో ట్రాన్స్‌జెండర్ అథ్లెట్లు పోటీ చేయడాన్ని పూర్తిగా నిషేధించనున్నారు.
- లింగ మార్పిడికి సంబంధించిన చికిత్సలపై కఠిన ఆదేశాలు అమలు చేస్తారు.
- అమెరికాలో తయారైన, స్థానికంగా సరఫరా అయ్యే ఆటోమొబైల్స్‌ను ప్రోత్సహించే విధంగా ఆదేశాలు జారీ చేస్తారు.








