తమిళనాడు ప్రభుత్వం (Tamil Nadu Government) మరో సంచలనాత్మక బిల్లు(Bill)ను అసెంబ్లీ (Assembly)లో ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో, ప్రజల్లో తమిళ సెంటిమెంట్‌ను పెంచే ఉద్దేశంతో డీఎంకే స్టాలిన్ (DMK Stalin) సర్కార్ ఈ కొత్త చట్టాన్ని తీసుకురానున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో హిందీని బలవంతంగా రుద్దడాన్ని నిషేధించే లక్ష్యంతో తమిళనాడు ప్రభుత్వం ఈ రోజు (అసెంబ్లీలో) ఒక బిల్లును పెట్టనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రతిపాదిత చట్టంపై చర్చించడానికి నిన్న రాత్రి న్యాయ నిపుణులతో అత్యవసర సమావేశం కూడా జరిగినట్లు సమాచారం.
ఈ బిల్లు తమిళనాడు అంతటా హిందీ హోర్డింగులు (Hindi Hoardings) , బోర్డులు (Boards), సినిమాలు (Movies), పాటలను (Songs) నిషేధించాలని(Ban) లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ చట్టం రాజ్యాంగానికి లోబడి ఉంటుందని డీఎంకే వర్గాలు చెబుతున్నాయి. డీఎంకే సీనియర్ నేత టీకేఎస్ ఎలంగోవన్ (TKS Elangovan) ఈ బిల్లుపై స్పందిస్తూ.. “మేము రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఏమీ చేయము. మేము దానికి కట్టుబడి ఉంటాము. హిందీని బలవంతంగా విధించడాన్ని మాత్రమే మేము వ్యతిరేకిస్తున్నాము” అని అన్నారు. అయితే, బీజేపీ (BJP) నేత వినోజ్ సెల్వం (Vinodh Selvam) మాత్రం ఈ చర్యను మూర్ఖత్వంతో కూడుకున్నదిగా అభివర్ణించారు. డీఎంకే భాషను రాజకీయ సాధనంగా ఉపయోగిస్తోందని ఆయన మండిపడ్డారు.
తిరుపరంకుండ్రం, కరూర్ దర్యాప్తు వంటి ఇతర కీలక సమస్యల నుండి ప్రజల దృష్టిని మళ్లించేందుకు డీఎంకే ప్రయత్నిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మరో ఏడాదిలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మరోసారి భాష సెంటిమెంట్‌ని రేకెత్తించాలని డీఎంకే చూస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇన్నాళ్లు డీఎంకే, ఏఐడీఎంకే మధ్యనే ప్రధానంగా పోటీ ఉండేది. ఈసారి మాత్రం విజయ్(Vijay) ‘తమిళగ వెట్రి కజగం’ (టీవీకే)(TVK) రూపంలో రాజకీయాల్లోకి ప్రవేశించడంతో పోరు త్రిముఖంగా మారింది. విజయ్‌కి వస్తున్న స్పందన చూసి ఒకింత డీఎంకే భయానికి లోనవుతుందని టీవీకే వర్గాలు ఆరోపిస్తున్నాయి.








